డిప్యూటీ సీఎంకు ఎన్డీఏ బిగ్ ఆఫర్.. తెరపైకి ఆ సీక్రెట్ డీల్
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ, ఊహించని రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 7 Jun 2026 7:00 PM ISTకూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ, ఊహించని రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ’కూటమి ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.. మేమంతా కలిసే ఉంటాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే, ఏపీ రాజకీయాల్లో మరో సంచలన వార్త బయటకొచ్చింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ నుంచి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఒక అద్భుతమైన బిగ్ ఆఫర్ ఖరారైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పవన్ చేసిన రాజకీయ త్యాగానికి దక్కిన ప్రతిఫలంగానే రాజకీయ వర్గాలు దీన్ని అభివర్ణిస్తున్నాయి.
జనసేన సరికొత్త చరిత్ర!
ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల సర్దుబాటు ఏకగ్రీవంగా ముగిసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. బలం ప్రకారం కూటమికి దక్కే ఈ నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను తీసుకోగా, జనసేనకు ఒక స్థానాన్ని కేటాయించారు. ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీని ద్వారా జనసేన పార్టీ దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఈసారి రేసులో బీజేపీకి చోటు దక్కలేదు. గతంలోనే బీజేపీకి రెండు సీట్లు ఇచ్చినందున, ఈసారి టీడీపీలోనే తీవ్ర పోటీ ఉండటంతో సర్దుబాటు సాధ్యం కాలేదని చంద్రబాబు ముందే స్పష్టం చేశారు.
అసలు ట్విస్ట్ ఇదే..
ఈ రాజ్యసభ ఎన్నికల వేళ జనసేన శ్రేణుల్లో జోష్ నింపేలా కూటమి పెద్దల నుంచి వచ్చిన హామీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ భారీ త్యాగానికి సిద్ధపడ్డారు. మొదట జనసేన 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. ముఖ్యంగా అనకాపల్లి సీటు నుంచి నాగబాబును బరిలోకి దించాలని ప్లాన్ చేశారు. కానీ కూటమి ధర్మం కోసం, బీజేపీ ఆ సీటు కోరడంతో పవన్ వెనక్కి తగ్గారు. అసెంబ్లీ సీట్లలోనూ సర్దుబాట్లు చేసుకున్నారు. అయితే ఆ నాటి త్యాగాన్ని చంద్రబాబు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మర్చిపోలేదని అంటున్నారు. 2024 నుండి 2029 మధ్య ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చే రాజ్యసభ స్థానాల్లో మొత్తం 3 సీట్లను జనసేనకు ఇచ్చేలా ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశంలోనే ముందుగానే ఒప్పందం కుదిరినట్లు తాజాగా జనసేన వర్గాలు స్పష్టం చేశాయి. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి సీటు దక్కగా.. భవిష్యత్తులో మరో 2 రాజ్యసభ సీట్లు జనసేన ఖాతాలో పడటం ఖాయమైందని అంటున్నారు.
ప్రస్తుతం ఒక సీటు దక్కగా, మిగిలిన రెండు సీట్లు 2028లో జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 2028లో మరో 4 స్థానాలు ఖాళీ కానుండగా, ఆ నాలుగు కూటమే దక్కించుకుంటుంది. 2029లో మళ్లీ జనరల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నందున 2028లో ఖాళీ అయ్యే నాలుగు సీట్లలో జనసేనకు ఒకేసారి రెండు సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో ఇక రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున ఎవరూ రాజ్యసభకు వెళ్లే చాన్స్ లేదని, బీజేపీ కూడా ఈ విషయం అర్థం చేసుకుని వెనక్కి తగ్గిందని విశ్లేషిస్తు్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు తక్షణ లాభాల కోసం చూస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ లాంగ్ టర్మ్ ప్లాన్ తో వ్యవహరించారని అంటున్నారు. నాడు సీట్లు త్యాగం చేసినప్పుడు విమర్శించిన వారికి, ఇప్పుడు పవన్ ఢిల్లీ స్థాయిలో తన పార్టీకి శాశ్వత గుర్తింపు తెచ్చుకుంటూ సమాధానం ఇచ్చారని విశ్లేషిస్తున్నారు.
