Begin typing your search above and press return to search.

అసలు జమిలి ఎన్నికలంటే ఏమిటో తెలుసా?

ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో దేశంలో ఒకేసారి పార్లమెంటుకు, రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు ఉన్నాయి

By:  Tupaki Desk   |   1 Sep 2023 10:31 AM GMT
అసలు జమిలి ఎన్నికలంటే ఏమిటో తెలుసా?
X

ప్రస్తుతం శాసనసభలకు, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో దేశంలో ఒకేసారి పార్లమెంటుకు, రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 1998లో దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికలపై ఆసక్తి చూపుతోంది. ఒకేసారి దేశమంతా పార్లమెంటుకు, రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తే భారీ ఎత్తున ధనాన్ని ఆదా చేయొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019లో పార్లమెంటు ఎన్నికల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చయ్యాయనే అంచనా ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం కూడా ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ఆయా పార్టీల ఖర్చు రూ.60 వేల కోట్ల వరకు ఉందని అప్పట్లో సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ బాంబుపేల్చింది. దేశ చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు ఈ ఖర్చు మొత్తం కలిసొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి పోలింగ్‌ అధికారుల నియామకం, ఎన్నికల నిర్వహణ, ఈవీఎం మెషీన్లు, భద్రతా సిబ్బంది నియామకం, పోలింగ్‌ ఏర్పాట్లు ఇలా భారీ ఎత్తున వ్యయమవుతోందనే అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రాష్ట్రాలకు, దేశానికి ఎన్నికలు నిర్వహిస్తే ఈ వేలాది కోట్ల రూపాయల ఖర్చును నివారించొచ్చని చెబుతున్నారు.

కాగా ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో ఐదు సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే దేశంలో సగం రాష్ట్రాల శాసనసభలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లోక్‌ సభలో 67 శాతం, రాజ్యసభలో 67 శాతం సభ్యులు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుందని అంటున్నారు. లోక్‌ సభలో బీజేపీకి అటూఇటుగా బలం ఉండటంతో అక్కడ తీర్మానం నెగ్గినా రాజ్యసభలో 67 శాతం మద్దతు లేకపోవడంతో ప్రతిపక్షాలు కూడా అంగీకరిస్తేనే జమిలి ఎన్నికలకు ముందడుగు పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దానికి మద్దతు ఇచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు లోక్‌ సభలో దాదాపు 333 ఓట్ల బలం ఉంది. ఇది 61 శాతానికి సమానమని అంటున్నారు. మరో 5 శాతం ఓట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. రాజ్యసభలో కేవలం 38 శాతం మాత్రమే బీజేపీకి సీట్లు ఉన్నాయి. దీంతో మరో 29 శాతం ఓట్లు బీజేపీకి అవసరమవుతాయి. అప్పుడే జమిలి ఎన్నికల బిల్లు నెగ్గుతుంది.

కాగా జమిలి ఎన్నికలకు కేంద్రం ముందుకెళ్లాలంటే.. రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్‌ 356కి సవరణ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే పార్లమెంటు పదవీ కాలాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 83, పార్లమెంటును రాష్ట్రపతి రద్దు చేసే అధికారమున్న ఆర్టికల్‌ 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాన్ని నిర్వచించే ఆర్టికల్‌ 172ను, అసెంబ్లీలను రద్దు చేసే ఆర్టికల్‌ 174ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్‌ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, పథకాలను అమలు చేయడంలో తరచూ ఎన్నికల కోడ్‌ రూపంలో అడ్డంకులు తగ్గిపోతాయని అంటున్నారు.

2015లో జరిగిన ఓ సర్వే ప్రకారం, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని వెల్లడైంది. అదే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఆరు నెలలు తేడాతో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకొనే అవకాశాలు 61 శాతానికి తగ్గిపోతాయని తేలింది.

వాస్తవానికి 1967 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్‌ సభ రద్దు వంటి పరిణామాలతో ఈ విధానం కొనసాగించడం సాధ్యం కాలేదు. 1983లో ఎన్నికల కమిషన్‌ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినా అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్‌ నివేదిక జమిలి ఎన్నికల ప్రస్తావనను మరోసారి లేవనెత్తింది. 2016లో ప్రధాని మోదీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్‌ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్‌ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. అతికొద్ది పార్టీలు మాత్రమే ప్రతినిధులను పంపాయి.