Begin typing your search above and press return to search.

జగన్ మేనిఫెస్టో తటస్థులను అట్రాక్ట్ చేస్తుందా ?

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ తాజాగా విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో భారీ హామీలు ఉండకపోవడం ఊరటను ఇచ్చేదే.

By:  Tupaki Desk   |   27 April 2024 8:59 AM GMT
జగన్ మేనిఫెస్టో తటస్థులను అట్రాక్ట్ చేస్తుందా ?
X

ఎన్నికల ప్రణాళిక అంటే ఉచితాల మీద ఉచితాలు అన్న విధానంగా తయారైంది అంటున్నారు. ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారు ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తారు అన్నది వేలం పాటగా మారింది. అయితే 2019లో జగన్ నవరత్నాలు పేరిట చాలానే హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడానికి ఏపీ అప్పుల కుప్ప అయింది అని కూడా విమర్శలు ఉన్నాయి.

అయిదేళ్ల జగన్ పాలనలో ఏకంగా ప్రత్యక్షంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల నగదు, అలాగే పరోక్షంగా మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల నగదుని అందించారు. దాంతో ఏటా లక్ష కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం మీదనే ఖర్చుగా పోయేది.

ఇదే ఏపీ అప్పుల కుప్పగా మారడానికి కారణం అయింది అని అంటారు. చంద్రబాబు 2019లో అధికారంలో నుంచి దిగిపోయినపుడు ఏపీ రెవిన్యూ అరవై వేల కోట్ల రూపాయలుగా ఉంటే జగన్ అయిదేళ్ల పాలలో అది లక్ష కోట్లకు చేరువ అయింది. ఇక కేంద్ర పన్నులు ఇతరత్రా ఆదాయాలు చూసుకున్నా రెండు లక్షల కోట్ల పై చిలుకు మాత్రమే ఏటా ఈ రోజుకూ రాష్ట్ర ఆదాయం ఉంది. కానీ ప్రతీ ఏటా బడ్జెట్ లో చూపించేది మాత్రం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మొత్తాలు.

వీటిలో ఏడాది చివరికి ఆదాయంగా మారేది కూడా ఏ ఇరవై ముప్పయి శాతమో తప్ప వేరేమీ కాదు. అయితే విభజన తరువాత గడచిన పదేళ్లలో రాష్ట్ర ఆదాయం రెట్టింపు అయింది. ఇంకా పెరుగుతుంది. కానీ వచ్చే ఆదాయానికి ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం అలాగే ఉంటోంది. దానికి కారణం వచ్చిన మొత్తాలలో సంక్షేమానికి ఏటా లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడమే. ఆ మిగిలిన లక్షా లక్షన్నర మొత్తంలో చూస్తే కనుక ఉద్యోగుల జీతాల నుంచి అన్నీ చూసుకోవాలి. దాంతో అభివృద్ధిని జీరో అన్న పరిస్థితి ఉంది.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ తాజాగా విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో భారీ హామీలు ఉండకపోవడం ఊరటను ఇచ్చేదే. పైగా రాష్ట్రంలో ఆదాయాన్ని అప్పులను దృష్టిలో ఉంచుకుని రానున్న అయిదేళ్లలో రెవిన్యూ మరో యాభై వేల కోట్లు పెరిగినా సంక్షేమం ఇచ్చేటట్లుగా ఉండాలి తప్ప అప్పులు పెద్దగా చేయరాదు అన్న విధానం కనిపిస్తోంది అని అంటున్నారు.

ఉచితాలు వద్దు అని చాలా మంది అంటున్నారు. అయితే అవసరం అయిన వర్గాలకే ఉచితాలు ఇవ్వడం వారికి చేయూతను ఇవ్వడం మంచిది. ఆ విధంగా చూస్తే కనుక వైసీపీ ఎన్నికల హామీలు ఆచరణాత్మకంగా ఉన్నాయని అంటున్నారు. బహుశా ఇది తటస్థులకు సైతం నచ్చవచ్చు అని అంటున్నారు.

అదే టైంలో భారీ హామీలతో టీడీపీ కూటమి వచ్చినా వాటిని ఎంత మేరకు నేరవేర్చగలదు అన్న చర్చ కూడా ఉండనే ఉంటుంది. ఎలా చూసుకున్నా ఉచితాల నుంచి జనాల దృష్టిని మార్చాల్సిన అవసరం ఉంది. దానికి వైసీపీ కొంత నియంత్రణతో ఇచ్చిన ఎన్నికల హామీలను పరిశీలించాల్సి ఉంది. వైసీపీ పెద్దగా హామీలు ఇవ్వలేదు కాబట్టి ఏపీని పాలించిన నేతగా చంద్రబాబు కూడా భారీ హామీల జోలికి పోకుండా తన ఎన్నికల ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తే అంతిమంగా అది ఏపీ ఖజానాకు మేలు అని అంటున్నారు. అలా కాకుండా భారీ హామీలు ఇస్తే మాత్రం అభివృద్ధిని కోరుకునే తటస్థులు ఏ వైపు టర్న్ తీసుకుంటారు అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్ మరి.