ఊరించి వదిలిన జగన్...!
తాను 2019లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాను అని అలాగే ఈసారి కూడా చేస్తాను అని జగన్ చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 11 March 2024 9:16 AM ISTతొందరలోనే వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని తీసుకుని వస్తామని జగన్ సిద్ధం సభలో చెప్పారు. ఆయన అలా చెబుతూ మేము హామీ ఇచ్చామంటే చేసి తీరుతామని ఒక స్పష్టమైన సందేశం పంపించారు. తాను 2019లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాను అని అలాగే ఈసారి కూడా చేస్తాను అని జగన్ చెప్పుకొచ్చారు.
దాంతో పాటుగా తాను అయిదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను నగదు బదిలీ పధకం కింద ఇచ్చాను అంటే అది ఒక ప్రణాళికాబద్ధంగా చేశాను అని చెప్పారు. తాను ఎనిమిది పధకాలు ఇచ్చానని వాటిని కనీసం టచ్ చేసే ధైర్యం కూడా విపక్షానికి లేదని జగన్ అంటున్నారు.
చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన ఎన్నికల హామీల బడ్జెట్ ఏటా లక్షా యాభై వేల కోట్లు అని జగన్ చెబుతూ అంత పెద్ద మొత్తంలో ఎలా ఇవ్వగలుగుతారు. బడ్జెట్ ఎలా సరిపోతుంది అని జగన్ ఇలా నిలువెత్తు ప్రశ్నను జనంలోకి వదిలారు. దానికి ఆయనే సమాధానం చెబుతూ చంద్రబాబుకు హామీలను అమలు చేయడం ఎపుడూ అలవాటు లేదు కాబట్టే ఆయన అలవి హామీలను ఇస్తున్నారని తీరా అధికారం దక్కితే వేటినీ అమలు చేయరని 2014 నుంచి 2019 దాకా ఆయన పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయని తీరుని ఎండగట్టారు.
మొత్తానికి ఏతా వాతా జగన్ చెప్పింది ఏంటి అంటే చంద్రబాబు హామీలు అన్నీ బూటకాలు అని ఏపీ బడ్జెట్ ని మించిపోయే హామీలు అని. అంతే కాదు తాను హామీలు ఇచ్చాను అంటే అయిదేళ్ళ పాటు ఎలా చేశానో అంతా చూశారు కదా అని చెప్పడం కూడా జగన్ చేసిన మరో పని.
ఇక తొందరలోనే ఎన్నికల ప్రణాళిక రిలీజ్ అని జగన్ చెప్పారు. మరి అందులో ఏ హామీలు ఉంటాయి అన్న ఉత్కంఠకు అయితే జగన్ తెర తీశారు అనే చెప్పాలి. ఒక వైపు హామీలు తాను కచ్చితంగా చేస్తాను అన్న బ్రాండ్ ఉన్నాదని చెప్పుకున్న జగన్ ఈసారి ఇచ్చే హామీలను కూడా జనం అంతే స్థాయిలో నమ్ముతారని అదే తన విజయానికి సోపానాలు వేస్తాయని కూడా వ్యూహంతో ఉన్నారు.
ఇక చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చని వాటిలో రైతు రుణ మఫీ డ్వాక్రా రుణాల మాఫీ వంటివి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఈ హామీలను జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో పెట్టి భారీ అస్త్రాలుగా జనంలోకి వదలబోతున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు.
అంతే కాదు చేయగలిగే హామీలు ఇస్తాను ఇవ్వగలిగేది చెబుతాను అని జగన్ చెబుతున్నారు. మరి వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ఎలా ఉండవచ్చు అన్న ఆసక్తిని అయితే పెంచేశారు. ఈ ఎన్నికల ప్రణాళికను జగన్ ఈ నెల 17వ తేదీలోగా అంటే మరో వారం రోజులలోగా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఆ తరువాతనే ఆయన ఎన్నికల ప్రచారం మొదలెడతారు అని అంటున్నారు. సో వైసీపీ మ్యానిఫేస్టో మొత్తం ఏపీలో పొలిటికల్ సినారియోని మార్చేస్తుందా అంటే వెయిట్ అండ్ సీ.
