పవన్ విషయంలో జగన్ వ్యూహం
ఏపీలో మూడు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడ్డాయి. అందులో పెద్దన్నగా టీడీపీ ఉంది. ఇక రెండవ ప్లేస్ లో జనసేన ఉంది.
By: Tupaki Desk | 27 Jun 2025 12:00 PM ISTఏపీలో మూడు పార్టీలు కలసి కూటమిగా ఏర్పడ్డాయి. అందులో పెద్దన్నగా టీడీపీ ఉంది. ఇక రెండవ ప్లేస్ లో జనసేన ఉంది. మూడవ ప్లేస్ ఎటూ బీజేపీదే. ఇందులో జగన్ మీద నిరంతరం విమర్శలు చేస్తూ వస్తోంది టీడీపీ మాత్రమే. ఆ పార్టీ జగన్ నామస్మరణ చేస్తోంది. ఎందుకంటే ఏపీలో కూటమికి ఆల్టర్నేషన్ వైసీపీ కాబట్టి.
ఏ మాత్రం వైసీపీ రాజకీయంగా బలపడినా అది కూటమికి ఎంతో ఇబ్బందిగా మారుతుందని కూడా టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ప్రతీ రోజూ వైసీపీని విమర్శించే పనిని పెట్టుకోవడం లేదు. అయితే విమర్శిస్తే మాత్రం బిగ్ సౌండే అవుతుంది. ఈ మధ్యనే ఆయన తొక్కి నార తీస్తామని చాలా కఠినమైన భాషనే ఉపయోగించారు. అంతే కాదు మక్కెలిరిచి కాళ్ళూ కీళ్ళూ విరిచి మూలన కూర్చోబెడతామని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ విషయానికి వస్తే పెద్దగా జగన్ మీద విమర్శలు అయితే ఉండవు. అపుడపుడు ఎవరైనా విమర్శిస్తే గత ప్రభుత్వం పనితీరు మీదనే మాట్లాడుతారు. దాంతో ఏపీలో రాజకీయం చూస్తే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే ఉంది. ఇక జగన్ సైతం టీడీపీనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. ఆయన మాట్లాడితే చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు.
చంద్రబాబుతో పాటుగా ఏమైనా అనాల్సి వస్తే లోకేష్ ని జత కలుపుతున్నారు. అంతకు మించి కూటమి మిత్రుల మీద ఒక్క మాట కూడా అనడం లేదు చాలా కాలంగా చూస్తే ఇదే కనిపిస్తోంది నిజానికి పవన్ కళ్యాణ్ తొక్కి నార తీస్తామని ఘాటు వ్యాఖ్యలు చేసిన తరువాత జగన్ నుంచి అదే రేంజిలో రియాక్షన్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ మాత్రం ఆ విషయమే పట్టించుకోలేదని అంటున్నారు.
మరి దానికి కారణం ఏమై ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. అయితే పవన్ ని అనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైసీపీ పెద్దలు గ్రహించడం వల్లనే ఇలా అని అంటున్నారు. ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఇపుడు దగ్గర చేసుకునే పనిలో వైసీపీ ఉంది. అందువల్ల పవన్ ని విమర్శిస్తే వారు మళ్ళీ దూరం అవుతారు, ఇది ప్రధాన కారణం అని అంటున్నారు.
అంతే కాకుండా కూటమి ప్రభుత్వంలో పవన్ పాత్ర మీద కూడా చర్చ సాగుతోంది. ఆయన పరిమితమైన స్థాయిలోనే తన అధికారాలను కలిగి ఉన్నారని అంటున్నారు. అందువల్ల కూటమి నిర్ణయాలకు నూరు శాతం టీడీపీ కారణం కాబట్టి ఆ పార్టీనే టార్గెట్ చేయాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఉంది. రేపటి రోజున ఆ పార్టీతోనే ఢీ కొట్టాలి. దాంతో టీడీపీ పట్ల వ్యతిరేకత ఎంత పెంచితే అంత వైసీపీకి లాభం అన్న ఆలోచనతో కూడా బాబునే టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు ఇక రాజకీయాల్లో రేపు ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు
జగన్ విషయమే తీసుకుంటే ఆయన పెద్దగా బీజేపీని ఎపుడూ విమర్శించినది లేదనే అంటారు. ఇపుడు పవన్ విషయంలోనూ అదే వ్యూహాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని కనుక దెబ్బ కొడితే ఏపీలో కూటమి ఉండదన్న మరో ఆలోచన కూడా ఇందులో ఉందని అంటున్నారు. ఏది ఏమైనా కూడా పవన్ వర్సెస్ జగన్ సమీప భవిష్యత్తులో ఉంటుందా అంటే ఏమో అన్న మాటే వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
