మాజీ సీఎం జగన్ 'ఈజ్ బ్యాక్': అసెంబ్లీకి హాజరుపై వైసీపీ బిగ్ ప్లాన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మారిందా? ప్రతిపక్ష హోదా ఇస్తేకాని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదంటూ గతంలో ప్రకటించిన మాజీ సీఎం జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 10 Feb 2026 7:00 AM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మారిందా? ప్రతిపక్ష హోదా ఇస్తేకాని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదంటూ గతంలో ప్రకటించిన మాజీ సీఎం జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11 నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని జగన్ నిర్ణయించుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనంటూ జరుగుతున్న ప్రచారం విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఈ నెల 11న అంటే ఈ బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 14న రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ హాజరు అవుతుందా? లేదా? అన్న అంశంపై గత కొద్దిరోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. ఇటీవల కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపైన అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై రెండు పక్షాలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలు చేసుకుంటుండగా, మాజీ సీఎం జగన్ తన శాసనసభ్యులతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలని అధికార పక్షం సవాల్ విసురుతోంది. లడ్డూ ప్రసాదం విషయంలో సీబీఐ సిట్ నివేదిక తమకు అనుకూలంగా ఉందని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనిని అధికార కూటమి కొట్టివేస్తోంది. అయితే తమ వాదనను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే అసెంబ్లీకి వెళ్లడమే కరెక్టు అన్న ఆలోచనకు వైసీపీ అధినేత వచ్చారని అంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేకాని సభకు రానంటూ ఇన్నాళ్లు చెప్పిన మాజీ సీఎం జగన్.. ఇప్పుడు సరైన అవకాశం వచ్చినందున సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారని, అందుకే సభకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
గత ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాలకు కూడా మాజీ సీఎం జగన్ తోపాటు వైసీపీ శాసనసభ్యులు హాజరయ్యారు. అయితే అప్పట్లో కేవలం పది నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. అనంతరం తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటూ యథావిధిగా తన వైఖరిని బయటపెట్టారు. అయితే వైసీపీ సభ్యులను సభకు రప్పించేందుకు అధికార పక్షం అనేక ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే అసెంబ్లీ సభ్యత్వం రద్దైపోతుందని ఒకసారి, సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని మరోసారి ప్రచారం చేయడం ద్వారా వైసీపీ సభ్యులపై అధికార కూటమి ఒత్తిడి పెంచుతోందని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు సభకు హాజరుకావాలని మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కారణం ఏదైనా అసెంబ్లీకి జగన్ హాజరు అవుతారనే ప్రచారమే హీట్ పుట్టిస్తోంది. జగన్ నిజంగా అసెంబ్లీకి హాజరైతే సభ కార్యకలాపాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత 20 నెలలుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా ముగిశాయి. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ప్రజాసమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ విషయంలో ఎవరు ఏం చెప్పినా ప్రజలకు సరైన మెసేజ్ వెళుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సివుంది. వైసీపీ ఏం చెబుతుందనేది అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
