Begin typing your search above and press return to search.

పొలిటికల్ గాసిప్ : జగన్ షర్మిల మధ్య సయోధ్య ?

అందరూ మనుషులే. అందరికీ కోప తాపాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి. మంటలు చల్లారుతాయి. తరువాత నార్మల్ గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు.

By:  Tupaki Desk   |   31 May 2025 9:34 AM IST
పొలిటికల్ గాసిప్ : జగన్ షర్మిల మధ్య సయోధ్య ?
X

అందరూ మనుషులే. అందరికీ కోప తాపాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి. మంటలు చల్లారుతాయి. తరువాత నార్మల్ గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు. పైగా రక్త బంధం, తోడబుట్టిన బంధం. దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునే వారు కలసిపోవడం జరుగుతుందని అంటారు.

ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడళ్ళుల్లు చంద్రబాబు దగ్గుబాటి కలుస్తారు అని ఎవరైనా అనుకున్నారా కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు. ఇపుడు చూస్తే వైఎస్సార్ ఫ్యామిలీలో జగన్ ఆయన సోదరి షర్మిల కలుస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

జగన్ తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్తా చివరికి కాంగ్రెస్ లో విలీనం అయింది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయింది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు అయితే వాటిలో ప్రధాన కారణాలలో ఒకటిగా షర్మిల ఉందని అంటారు.

ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్ కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించింది అని అంటారు. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ కి దక్కకుండా పోయింది అని చెబుతారు.

ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ళ పాటు వేడిగా వాడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది.

జగన్ కి తల్లిని చెల్లెలుని ఇంటి నుంచి పంపేశారు అన్న నింద బాగా పడింది. నిన్నటికి నిన్న లోకేష్ కడపలో ఇదే విషయం మీద బిగ్ సౌండ్ చేశారు. ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవరపెడుతూనే ఉంది సెంటిమెంట్ గా ఇది ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అదే వైసీపీకి ఇబ్బందులు తెస్తుందని కూడా అంటున్నారు.

ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ జగన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్న వేళ వైసీపీ చాలా ఇరకాటంలో పడుతోంది అని అంటున్నారు. దాంతో పాటుగా అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదు అని అంటున్నారు. దాంతో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరూ తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్ గా మొదలై ప్రచారం సాగుతోంది.

దానికి ఒక సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించిన వార్త రావడం అని అంటున్నారు. తాత వైఎస్ రాజారెడ్డి వందవ జయంతి వేళ షర్మిల ఇడుపులపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వింతే అని అంటున్నారు.

జగన్ తో విభేదించిన తరువాత షర్మిల వార్తలు ఏవీ సాక్షిలో అసలు కవర్ చేయడం లేదు అని చెబుతారు. అలాంటిది ఇపుడు షర్మిల వార్త రావడంతో జగన్ చెల్లెలు మీద సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారా కొంత అయినా సానుభూతిని చూపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. మరో వైపు చూస్తే ఆస్తుల వ్యవహారంలో ఇద్దరి మధ్య రాజీకి చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో ఏమైనా జరగవచ్చు అనే అంటున్నారు. చూడాలి మరి ఇవి ఒట్టి గాసిప్ నా లేక నిజాలుగా మారుతాయా అన్నది.