కూటమి ప్రభుత్వం కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత
కేసులతో కూటమి ప్రభుత్వం హడలెత్తిస్తున్న వేళ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:14 PM ISTకేసులతో కూటమి ప్రభుత్వం హడలెత్తిస్తున్న వేళ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేసిన ప్రభుత్వం.. తాజాగా జగన్ పైనా కేసు నమోదు చేయడాన్ని మాజీ సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని అంటున్నారు. ప్రమాదవశాత్తూ జరిగన ఘటనకు తనను బాధ్యుడు చేయడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలేస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పద్మవ్యూహం నుంచి తప్పించుకునే అంశమై వ్యూహరచనకు అధినేత జగన్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో గుంటూరు నగర శివార్లలోని ఏటుకూరు రోడ్డు వద్ద ప్రమాదం జరగడం, ఈ సంఘటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదానికి జగన్ ప్రయాణిస్తున్న కారే కారణమంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా ఒకరి మరణానికి కారణమయ్యారని మాజీ సీఎంపై కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరుగుతున్నా, ఇంతవరకు అధినేత జగన్ ను మాత్రం టచ్ చేయలేదు.
జగన్ ను కూడా ఏదో కేసులో అరెస్టు చేస్తారని, ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని ఇంతవరకు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జగన్ పై రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేయడం, ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారనే అభియోగాలు మోపడమే సంచలనంగా మారింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలను చిన్న కేసుగా చూసినా, ఇక్కడ మాజీ సీఎం జగన్ ను నిందితుడు చేయడమే చర్చనీయాంశమవుతోంది. అంతేకాకుండా ఘటన జరిగిన తర్వాత కారులో ప్రయాణిస్తున్నవారికి ప్రమాదం గురించి తెలిసినా పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలియడంతో వైసీపీ అధినేత జగన్ అప్రమత్తమయ్యారని అంటున్నారు. ఈ ఘటన ద్వారా భవిష్యత్తులో తన పర్యటనలకు చెక్ చెప్పేలా ప్రభుత్వం పావులు కదుపుతుందని అనుమానిస్తున్న జగన్.. ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామన్నట్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎప్పటి నుంచో జిల్లాల పర్యటనకు వెళదామని భావిస్తున్న జగన్, ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తుండటంతో జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆలస్యం చేయకూడదనే ఆలోచనతో వచ్చేనెలలో జరిగే వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమం నుంచి జిల్లాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
ఇక జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు పార్టీ పీఏసీ మీటింగు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంపై తనను నిందితుడిగా చేర్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తనను బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న విషయం ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నెల 25న పీఏసీ భేటీ నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో బుధవారం పార్టీ ముఖ్యులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పీఏసీ సభ్యులు తాడేపల్లి రావాల్సిందిగా సమాచారం వెళ్లిందని అంటున్నారు.
