ఇదేంది జగనన్నా: వెళ్తోంది పరామర్శకు.. చేస్తోంది ఎన్నికల ప్రచారమా?!
అయితే.. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నా.. జగన్ తన తీరును మార్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Jun 2025 3:44 PM ISTస్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్.. అన్నారు ఆత్రేయ. అలానే ఉంది వైసీపీ అధినేత జగన్ పర్యటన పనితీరు. గతంలో వైఎస్ మరణించినప్పుడు ఆయన లేరన్న వార్త తెలిసి కొందరు మృతి చెందారు. అప్పట్లో కూడా.. జగన్ ఏడాది ఆగి ఓదార్పు యాత్రల పేరిట ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించారు. కానీ.. ఓ దార్పు యాత్రలను ఎన్నికల యాత్రలుగా నిర్వహించడంతోనే కాంగ్రెస్‌లో కొందరు పెద్దలు విభేదించారు. ఇదే ముసలానికి దారి తీసింది.
అయితే.. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకున్నా.. జగన్ తన తీరును మార్చుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి చెందిన చాలా మంది దీనిని సమర్థిస్తున్నా.. మరికొందరు మాత్రం ``ఇది బాలేదు!`` అని పెదవి విరుస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ మాజీ నాయకుడు ఒకరు 2024 ఎన్నికల తర్వాత.. బలవన్మరణానికి పాల్పడ్డారు. కొన్నాళ్ల కిందట ఆయన సంవత్సరీకం కూడా అయిపోయింది.
అయితే.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయలు దేరారు. సరే..ఎవరిని ఎప్పుడు పరామర్శించాలనేది జగన్ ఇష్టం. కానీ.. ఈ చావుకు సంబంధించిన పరామర్శను కూడా.. ఓ వేడుకగా.. ఎన్నికల ప్రచారంగా మార్చడమే ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా.. సొంత పార్టీలోనే కీలక నాయకులు దీనిని విమర్శిస్తుండడం గమనార్హం. ఇదేంది జగనన్నా.. అంటూ.. కొందరు పెదవి విరుస్తున్నారు.
జగన్ ఇంటి నుంచి రెంటపాళ్లకు 72 కిలో మీటర్లు.. కానీ.. దీనిని యాత్ర మాదిరిగా మార్చడంతో ఒక్కొక్క కిలో మీటరు ప్రయాణించేందుకు జగన్ సొంత మీడియా కథనం మేరకు గంటకు పై గా పడుతోంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభించిన ఈ పరామర్శ యాత్ర.. మధ్యాహ్నం 1 గంట సమయానికి కేవలం 40 కిలో మీటర్లు మాత్రమే చేరింది.
అంటే.. ఈ పరామర్శ యాత్రను కూడా.. తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ.. ఇలాంటి యాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు నేరుగా ఆ కుటుంబాలను కకలుసుకునేందుకు ఆయన ఒక్కరు లేదా ఓ పదిమంది వెళ్తే సరిపోతుంది. కానీ.. ఎన్నికల అనంతరంకూడా.. తన హవా తగ్గలేదని నిరూపించుకునే క్రమంలో జగన్ చేస్తున్న హడావుడిగా నాయకులు భావిస్తున్నారు.
