Begin typing your search above and press return to search.

పులివెందులలో జగన్.. ఆ విమర్శలకు చెక్!

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2026 3:54 PM IST
పులివెందులలో జగన్.. ఆ విమర్శలకు చెక్!
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. మంగళవారం పులివెందులకు వెళ్లిన జగన్ బుధవారం నియోజకవర్గ పరిధిలోని వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నందీశ్వర ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ నేతల చొరవతో రూ.6 కోట్ల విరాళాలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి నందీశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించారు.

సొంత నియోజకవర్గంలో నందీశ్వర ఆలయ ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్ తనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారంటూ గత కొన్ని నెలలుగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ కు హిందూ మతం అంటే గౌరవం లేదని, హిందూ మత విశ్వాసాలపై నమ్మకం లేదని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ తరహా ఆరోపణలు, విమర్శలతో మాజీ సీఎం జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

అయితే తనపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై జగన్ నేరుగా స్పందించకపోయినా, సొంత నియోజకవర్గం పులివెందులలో శివాలయం ప్రతిష్టకు హాజరుకావడం, స్వయంగా పూజలు, హోమాలు చేయడం ద్వారా తనకు హిందూ దేవుళ్లపై నమ్మకం ఉందని చాటుకున్నారని అంటున్నారు. సంప్రదాయ వస్త్రాలను ధరించి నందీశ్వరుని నూతన విగ్రహా ప్రతిష్ట, కుంభాభిషేక మమోత్సవంలో జగన్ పూజలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తనకు హిందూ మత ఆచార, వ్యవహారాలు అంటే గౌరవం ఉందని చాటుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకపోవడం గమనార్హం అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు సైతం పూర్తి భక్తి ప్రవర్తులతో నడుచుకోవడాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. సాధారణంగా జగన్ ఎక్కడకు వెళ్లినా, జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ ఆయన అభిమానులు నినాదాలతో హోరెత్తిస్తుంటారు. అయితే సొంత నియోజకవర్గం పరిధిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ నినాదాలు చేయకుండా శ్రేణులను వైసీపీ నేతలు కట్టడి చేయడం కూడా ఆకట్టుకుందని అంటున్నారు. మొత్తానికి శివుడి ద్వారా తనపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలను జగన్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.