Begin typing your search above and press return to search.

బాబును తిడితే క‌దిలారు.. మ‌రి జ‌గ‌న్‌ను తిడితే.. !

గ‌తంలో చంద్ర‌బాబును, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్‌ను వైసీపీ దూషిస్తే.. వెంటనే వారి సొంత సామాజిక వ‌ర్గం నుంచి కౌంట‌ర్లు ప‌డేవి.

By:  Garuda Media   |   13 July 2026 10:00 PM IST
బాబును తిడితే క‌దిలారు.. మ‌రి జ‌గ‌న్‌ను తిడితే.. !
X

రాజ‌కీయాల్లో వ్య‌క్తుల నేప‌థ్యంగా.. వ‌ర్గాలు పోరాటం చేయ‌డం తెలిసిందే. గ‌తంలో చంద్ర‌బాబును, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్‌ను వైసీపీ దూషిస్తే.. వెంటనే వారి సొంత సామాజిక వ‌ర్గం నుంచి కౌంట‌ర్లు ప‌డేవి. అంతేకాదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ ఎత్తున ఫండింగ్ కూడా జ‌రిగింది. మొత్తంగా చంద్ర‌బాబును, టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డంలో రాజ‌కీయ వ్యూహాలు ఎలా అయితే.. ప‌ని చేశాయో.. అలానే.. వీరి సొంత సామాజిక వ‌ర్గం అంతే బ‌లంగా ప‌నిచేసింది.

మ‌రి జ‌గ‌న్ మాటేంటి? అనేది ప్ర‌శ్న‌. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రెండు సార్లు(2004, 2009) విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు మాత్ర‌మే కాదు.. ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం కూడా బ‌లంగా నిలిచింది. ఇదే రెండోసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం క‌లిగేలా చేసింది. అంతెందుకు.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన భారీ విజ‌యం వెనుక కూడా ఓ సామాజిక వ‌ర్గం కీ రోల్ పోషించింది. సో.. మొత్తానికి నాయ‌కుల‌ సొంత సామాజిక వ‌ర్గాలు బ‌లంగా పనిచేస్తున్నాయి.

ఈ రూపంలో చూస్తే.. రెడ్డి సామాజిక వ‌ర్గం జ‌గ‌న్‌కు ఎంత మేర‌కు అండ‌గా ఉంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌స్తుతం వైసీపీపై ప్ర‌భుత్వ ప‌క్షాల నుంచి జోరుగా దాడి పెరిగింది. దీనిని త‌ప్పుప‌ట్టేందుకు అవ‌కాశం లేదు. రాజ‌కీయాల్లో ఎవ‌రి పాత్ర వారిది. ఎవ‌రి పైచేయి కోసం వారు ప్ర‌య‌త్నిస్తారు. అయితే.. ఈ స‌మయంలో ఇత‌ర నేత‌ల కంటే.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల కంటే కూడా.. రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా నిల‌బ‌డుతుంద‌ని జ‌గ‌న్ భావించి ఉంటారు.

కానీ, ఎక్క‌డా ఆ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలై.. రెండు సంవ‌త్స‌రాలు అయిపోయిన త‌ర్వాత‌.. కూడా రెడ్డి వ‌ర్గంలో ఎలాంటి క‌ద‌లికా రాలేదు. వ‌చ్చేలా సూచ‌న‌లు కూడా క‌నిపించ‌డం లేదు. దీనికి జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రే కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఒంటెత్తు పోక‌డ‌ల‌తో త‌న‌కు అండ‌గా ఉంటున్న‌వారిని ఆయ‌న కాద‌నుకుంటున్న తీరు కార‌ణంగానే రెడ్లు దూర‌మ‌య్యార‌న్న టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సామాజిక వ‌ర్గం త‌ట‌స్థంగా ఏమీ లేదు. ఓ కీల‌క పార్టీ వైపు అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ వైసీపీ నాయ‌కుడు ఒక‌రు చ‌క్రం తిప్పుతున్నారు. ఇదే జ‌రిగితే వైసీపీకి మ‌రింత డ్యామేజీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు.