Begin typing your search above and press return to search.

పాదయాత్ర కాదు...జగన్ అర్జంటుగా చేయాల్సింది ?

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర మీదనే ఫోకస్ పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2026 8:00 PM IST
పాదయాత్ర కాదు...జగన్ అర్జంటుగా చేయాల్సింది ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర మీదనే ఫోకస్ పెడుతున్నారు. అది కూడా 2027 జూలై నెలలో వైఎస్సార్ జయంతి తరువాత సుదీర్ఘమైన పాదయాత్ర మొదలెట్టాలని జగన్ చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ఆయన ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి 2024 లో వైసీపీ ఓటమి పాలు అయ్యాక అడపా దడపా జగన్ జనంలోకి వచ్చారు. ఇక అసెంబ్లీకి ఆయన వెళ్లడం మానుకున్నారు. తన ఎమ్మెల్యేలను కూడా పంపించడం లేదు. జిల్లాల పర్యటనలు అన్నారు, అవి కూడా ప్రచారంలోనే ఉండిపోయింది. ఇక కళ్ళు మూసుకుంటే ఎంతసేపూ ఒక ఏడాదిలో పాదయాత్ర మొదలవుతుంది అని జగన్ చెబుతూ వస్తున్నారు.

బిజీ అయితే పార్టీ విషయం :

ఇక జగన్ పాదయాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగనుంది. ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల దాకా పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఈసారి కీలకమైన పంచాయతీల గుండా పాదయాత్ర సాగుతుందని అంటున్నారు. దాంతో జగన్ అయితే ఫుల్ బిజీగా ఉంటారు అని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీ మీద ఆయన దృష్టిని పూర్తిగా పెట్టగలరా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక పాదయాత్రతోనే అధికారం దక్కుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు కానీ అధికారం దక్కాలంటే పాదయాత్ర ఒక్కటే సరిపోతుందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.

నిలిచి నిలువరించాలి :

వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఉదాశీనంగా వ్యవహరించారు అని విమర్శలు ఉన్నాయి. వారు మధ్యాహ్నం నాటికే చాలా చోట్ల కనిపించలేదని కూడా చెప్పుకున్నారు. ఇక కౌంటింగ్ వేళ కూడా ఉదయం పది తరువాత అంతా ఖాళీ చేసారు అని కూడా వార్తలు వచ్చాయి. ట్రెండ్ అవుతున్న కౌంటింగ్ సరళి చూసి ఎవరూ ఆ వైపుగా పోలేదని కూడా విమర్శలు వచ్చాయి. ఇవే వైసీపీ తరువాత అనేక డౌట్లు వ్యక్తం చేసినా జవాబు దొరకక పోవడానికి కారణం. ఓడినా గెలిచినా చివరి ఓటు లెక్కించే వరకు ఉండాలని పార్టీ ఆదేశించిందో లేదో తెలియదు కానీ ఎవరూ పత్తా లేకుండా పోయారు. అలాగే పోలింగ్ వేళ బూత్ లలో గట్టిగా నిలబడలేదు. మరి 2029 ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి కదా అని అంటున్నారు.

కసి పెరగాలీ అంటే :

వైసీపీ క్యాడర్ లో కానీ లీడర్ లో కానీ కసి పెరగాలంటే ఆదేశాలు ఇస్తే సరిపోదని వారిని విశ్వాసంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అంతే కాదు అంతా తన పాదయాత్రతోనే అని జగన్ భ్రమించిన నాడు క్యాడర్ కూడా మునుపటి మాదిరిగానే కాళ్ళు బార జాపేస్తుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అందువల్ల క్యాడర్ తో మీటింగ్స్ నిర్వహించడం, సత్తా కలిగిన వారిని గుర్తించి సైన్యంగా బూత్ లెవెల్ దాకా నియమకాలు చేసి ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓట్లు ఎక్కడా పోకుండా వేయించుకునే విధంగా పకడ్బంధీ నిర్మాణం పార్టీ పరంగా జరగాలని అంటున్నారు. అదే సమయంలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వాలని అంటున్నారు. జనాల దగ్గరకు పాదయాత్రగా వెళ్ళడం మంచిదే కానీ దాని కంటే ముందు పార్టీ జనాలను రప్పించుకుని వారితో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఏ పార్టీకైనా క్యాడర్ అతి ముఖ్యమైనది అంటున్నారు. వారు కసిగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని అంటున్నారు.

లోకల్ బాడీస్ తో :

ఇక లోకల్ ఫైట్ కూడా ఈ ఏడాది ఉంది అని అంటున్నారు. వైసీపీ అయితే ఆ దిశగా పెద్దగా దృష్టి పెడుతోందా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. లోకల్ ఫైట్ లో గెలిచినా లేకపోయినా క్యాడర్ కి ఒక బూస్టప్ గా ఉంటుందని వారి స్పిరిట్ ఏమిటి అన్నది తెలుస్తుందని అంటున్నారు. అంతే కాదు 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇది రిహార్సల్ గా ఉంటుందని లోపాలు ఎక్కడ ఉన్నాయో చూసి సరిచేసుకోవడానికి ఉపకరిస్తుందని అంటున్నారు. ఇక జగన్ పాదయాత్ర పేరుతో విలువైన సమయాన్ని ఎన్నికల వేళ ఖర్చు చేయడం కంటే దానిని తగ్గించుకుని ఈ లోగా జిల్లాల పర్యటనలు చేస్తూ జనాల సమస్యల మీద ప్రజా క్షేత్రంలో ఉంటూ పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని కూడా సూచనలు వస్తున్నాయని అంటున్నారు.