ఇసుకపైనా మరో సిట్.. మళ్లీ జగనే టార్గెట్!
మాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా కూటమి ప్రభుత్వం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.
By: Tupaki Desk | 24 May 2025 12:00 PM ISTమాజీ ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా కూటమి ప్రభుత్వం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ స్కాంలో జగన్ ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లిక్కర్ స్కాంపై వివరాలు సమర్పించినట్లు చెబుతున్నారు. మద్యం స్కాంపై అమిత్ షాతో చర్చించానని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో జగన్ అరెస్టు చేసే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇసుక మైనింగులో వేల కోట్ల అక్రమాలు జరిగాయని భావిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మరో సిట్ వేసింది.
వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలోని ఇసుక విధానంపై విచారణకు ఆదేశించింది. ఏసీబీ కేసు నమోదు చేయించి గత ప్రభుత్వంలో మైనింగ్ కార్పొరేషన్ మేనేజింగు డైరెక్టరుగా పనిచేసిన వెంకటరెడ్డిని అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అప్పట్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) వేసింది. దీనికి రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు నేతృత్వం వహిస్తారు. అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్, డీఎస్పీలు కిశోర్, సుబ్బరాజు, రామక్రిష్ణ, జెస్సీ ప్రశాంతిలను సభ్యులుగా నియమించారు. వీరికి సహాయంగా తొమ్మిది మంది సర్కిల్ ఇన్ స్పెక్టర్లను కేటాయించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జోన్లుగా విభజించి దర్యాప్తు చేయనున్నారు.
ఏ జోన్ లో ఎన్నిక ఇసుక రీచ్ లు ఉన్నాయి. వాటిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇసుక తవ్వారు. కాంట్రాక్టు కంపెనీయా లేదా స్థానిక వైసీపీ నాయకులా? అనేది సిట్ తేల్చనుంది. ఇసుక తవ్వకాలకు సహకరించిన మైనింగు అధికారులు, చోద్యం చూసిన సెబ్ అధికారులు, తవ్విన ప్రొక్లయినర్లు, ఇసుక తరలింపునకు వాడిన లారీలు వంటి వివరాలను ఆరా తీయనున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ధిక్కరించి రాత్రింబవళ్లూ నదీ గర్భాన్ని గుల్ల చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.
వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు కంపెనీలు, సబ్ కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు, జిల్లాల్లో అడ్డూఅదుపు లేకుండా తవ్వేసిన వైసీపీ నేతల పాత్రపై ఏసీబీ ఇప్పటికే ఆధారాలు సేకరించిందని చెబుతున్నారు. రాష్ట్రంలో నదులు, వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వి పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు జిల్లాల వారీగా నదులను వాటాలు వేసుకుని తవ్వుకుని డబ్బు దండుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా దాదాపు రూ.2,566 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలు సేకరించినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. 2021 మే నెలలో మొదలైన ఇసుక అక్రమ తవ్వకాలు వైసీపీ ప్రభుత్వం కొనసాగిన అన్నేళ్లు నిరాటంకంగా సాగించారని ఆరోపిస్తున్నారు.
