జైలు ఊసలు వెనుక జగన్ ఫొటో.. మాజీ సీఎం ఆరోపణలపై తీవ్ర స్పందన.. అసలు నిజం ఇదే!
కర్నూలు జైలులో తనకు అవమానం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
By: Tupaki Desk | 14 Aug 2026 10:01 PM ISTకర్నూలు జైలులో తనకు అవమానం జరిగిందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన సోదరుడు శ్రీరాములును పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ గురువారం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి అయిన తనను అవమానించేలా జైలు ఊసల బయట నిలబెట్టి ఫొటో తీశారంటూ జైలు అధికారులపై జగన్ రెడ్డి మండిపడ్డారు.
కాగా, జగన్ రెడ్డి విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో జైలులో ఏం జరిగిందో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం సమగ్ర వివరణ ఇచ్చిన సూపరింటెండెంట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని అవమానించేలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. జైలు మాన్యువల్ ప్రకారమే ఫొటోలు తీసుకున్నామని తెలిపారు. అదేసమయంలో ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్ కు వచ్చేవారి ఫొటోలు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. మాజీ సీఎం ఫొటో కూడా అదేవిధంగా తీసుకున్నామని వెల్లడించారు. ఈ ప్రిజన్స్ సాఫ్ట్ వేర్ ప్రకారం ఎంతమంది నిందితులను కలుస్తారో అంతమంది ఫొటోలు తీసుకోవాల్సివుంటుందని వివరించారు.
మాజీ సీఎం ఆరోపణలపై జైలు సూపరింటెండెంట్ వివరణతో ఈ వివాదం మరో మలుపు తిరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. జైలు నిబంధనల మేరకే ఫొటోలు తీసుకున్నామనే సూపరింటెండెంట్ వాదనతో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలుగానే భావించాల్సివుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంలో అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయనే అంశంపై వైసీపీ నాయకులు అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజంగా జైలు నిబంధనల మేరకే మాజీ సీఎం ను జైలు ఊసలు వెనుక నిలబెట్టి ఫొటోలు తీశారా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? అనే అంశంపై వైసీపీ లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితోపాటు, వైసీపీ సీనియర్ నేతల పట్ల అగౌరవంగానే వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో గత రెండేళ్లలో పలుమార్లు జగన్మోహనరెడ్డి తమ పార్టీ నేతలను జైలులో పరామర్శించగా, గతంలో ఎప్పుడూ చేయని ఆరోపణలు ఇప్పుడు చేయడమే చర్చకు దారితీసింది. సూపరింటెండెంట్ చెప్పినట్లు నిజంగా నిబంధనల ప్రకారమే జైలు ఊసల వెనుక ఫొటోలు తీసుకుని ఉంటే, గతంలో ఎందుకు ఫొటోలు తీయలేదు? అప్పుడు తీసినా జగన్ రెడ్డి బయటకు చెప్పలేదా? అంటూ రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి సూపరింటెండెంట్ వివరణతో వివాదం మలుపు తిరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.
