కేసీఆర్ తో దోస్తీ.. జగన్ కు మేలేనా!?
తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులైన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మధ్య బలపడుతున్న బంధం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.
By: Tupaki Desk | 24 Dec 2025 9:00 PM ISTతెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులైన వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మధ్య బలపడుతున్న బంధం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వీరి మధ్య స్నేహ బంధం మొగ్గతొడిగినా.. తాజా పరిణామాల మధ్య ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితులతో రాజకీయాలలో ఎటువంటి మలుపులు చోటుచేసుకోనున్నాయనే ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం పొత్తు రాజకీయాలకు దూరంగా ఉంటున్న జగన్, కేసీఆర్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకుని పనిచేస్తారా? లేక ఒకరికొకరు అండగా నిలుస్తూ ఎవరికి వారే రాజకీయంగా పావులు కదుపుతారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం వద్ద వేసిన పోస్టరులో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు పెట్టడం, అదేవిధంగా ఎన్నడూ లేనట్లు హైదరాబాద్ లో కూడా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
తాజా పరిణామాలతో మాజీ సీఎంలు జగన్, కేసీఆర్ మధ్య స్నేహం బలపడిందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. తన స్వరాష్ట్రం కన్నా ఏపీ వ్యవహారాలపై ఎక్కువగా మాట్లాడటం కూడా కొత్త సందేహాలకు తావిస్తోందని అంటున్నారు. అయితే ఈ సరికొత్త రాజకీయం వల్ల ఎవరికి ప్రయోజనం అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ టీడీపీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్.. ఎక్కువగా ఏపీ వ్యతిరేక భావ జాలంలోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని వెనకేసుకు రావడమో లేక ఆ పార్టీని బలపరచడమో వల్లనో కేసీఆర్ కు రాజకీయంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా ఎదురీదుతున్న బీఆర్ఎస్ దేశంలో తటస్థ రాజకీయాలను ఎంచుకుంది. ఇండి కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. అటు బీజేపీకి దగ్గర కాలేకపోతోంది. ఇక మూడో ప్రత్యామ్నాయం కూడా లేక తెలంగాణలో ఒంటరిగా మిగిలిపోయింది.
ఇటు ఏపీలో కూడా వైసీపీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్డీఏ కూటమి వల్ల అధికారం కోల్పోయిన వైసీపీ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో చేతులు కలిపే సాహసం చేయలేకపోతోంది. అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచి ప్రయత్నంపైనా తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. టీడీపీ వ్యతిరేక భావజాలంతో ఇరుపార్టీల కేడర్ ఒక్కటిగా మాటలు ఆడుతున్నా.. రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే.. బీఆర్ఎస్ తో బహిరంగ దోస్తీ చేయాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వేసిన ప్లెక్సీపై రాష్ట్రంలో ఎలాంటి చర్చ జరుగుతోందన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన రాజకీయం కోసం ఎవరినైనా వాడుకుంటారని, తెలంగాణ భావజాలాన్ని రగిల్చడానికి ఆయన చంద్రబాబును బూచిగా చూపుతారని అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న వైసీపీని కేసీఆర్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ద్వారా కేసీఆర్ కు ప్రయోజనం తప్పితే.. ఆయన ద్వారా వైసీపీకి ఎలాంటి మేలు ఉండదని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం కేసీఆర్ కు దగ్గరయ్యే పరిస్థితి ఉందని, కానీ, కేసీఆర్ వల్ల ఏపీలో ఏ వర్గం జగన్ కు దగ్గరయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణంగా కాంగ్రెస్ ను ద్వేషిస్తున్న మాదిరిగానే కేసీఆర్ ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారని, అది గమనించకుండా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో వైసీపీ ఇరుక్కుంటే అసలుకే ప్రమాదం వస్తుందని అంటున్నారు.
