Begin typing your search above and press return to search.

బాబు గారూ...మీరు భయపడుతున్నారు

బాబులో భయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని జగన్ అంటున్నారు. బాబు భయాన్ని జగన్ బాగానే కనిపెట్టేశారు.

By:  Satya P   |   21 April 2026 8:45 PM IST
బాబు గారూ...మీరు భయపడుతున్నారు
X

అవునా చంద్రబాబుకు భయమా. అర్ధ శతాబ్దం రాజకీయం, నాలుగు సార్లు సీఎం గా చేస్తూ వస్తున్న జాతీయ నాయకుడిగా సీనియర్ అయిన చంద్రబాబులో భయమా. భయమే అంటున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. బాబులో భయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది అని జగన్ అంటున్నారు. బాబు భయాన్ని జగన్ బాగానే కనిపెట్టేశారు. ఎలా అంటే తన పరిపాలనను తాను ఎన్నికల్లో కూటమి తరఫున ప్రజలకు ఉద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటి అని నిలదీసిన వారి మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారని వారి గొంతు బలంగా నొక్కేస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు.

మీకు ఒక న్యాయమా :

ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం డిస్మిస్ చేయడం పట్ల జగన్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ లో ఆయన బాబు మీద నిప్పులు చెరిగారు. మీకు ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో ఏపీ ఎన్జీవో నేతగా ఉన్న అశోక్ బాబు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బీజేపీని ఓడించమని పిలుపు ఇచ్చారు అని కూడా జగన్ చెప్పారు. మరి ఆయన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదని నిలదీశారు.

అడగడమే తప్పా :

స్వయంగా ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడమే తప్పా అని జగన్ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలు అయ్యాయో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీలో నిరుద్యోగులకు ఇరవై లక్షల దాకా ఉద్యోగాలు ఇస్తామని ఈలోగా వారికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని బాబు హామీ ఇచ్చి వారిని మోసం చేయలేదా అని గద్దించారు. అంతే కాదు సూపర్ సిక్స్ హామీలు ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చారా అని కూడా ప్రశ్నించారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలను ఇస్తామని అలాగే వారికి కొత్త పీఅర్సీని ఏర్పాటు చేస్తామని ఐఆర్ ని ప్రకటిస్తమని హామీలు ఇచ్చి రెండేళ్ళు గడుస్తున్నా ఇవ్వకపోతే వారు అడగడంలో తప్పు లేదు కదా అని జగన్ అన్నారు. మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసినా ఏపీలో ఏమీ చేయలేని పరిస్థితుల మీద సామాన్యుడు నిలదీస్తూంటే గొంతులు నొక్కుతారా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతటా వ్యతిరేకత :

ఒక వైపు నుంచి జనంలోనూ మరో వైపు నుంచి ఉద్యోగులలోనూ తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఈ పరిస్థితుల్లో ఎవరైనా తనను ప్రశ్నిస్తే బాబులో భయం ఎక్కువ అవుతోందని జగన్ విశ్లేషించారు. అందుకే అడిగిన వారి మీద వేటు వేసుకుంటూ పోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మీ పరిపాలన బాగా లేదని మీకూ అర్ధం అయిందని అందుకే ఎవరినీ నోరెత్తకుండా చేస్తున్నారు అని జగన్ విమర్శించారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇచ్చిన హామీలకు అతీ గతీ లేదని దాంతోనే తమ తప్పులు ఉన్నాయని తాము సరిగ్గా ఏమీ చేయలేకపోతున్నామని బాబు ఒప్పుకుంటున్నారని జగన్ నిర్దారించారు.

రెడ్ బుక్ రాజ్యాంగంతో :

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని జగన్ నిందించారు. ఎవరైనా గొంతుక పెంచితే డిస్మిస్ అంటూ అస్త్రం ప్రయోగిస్తున్నారు అని జగన్ ఆగ్రహించారు. గతంలో సీఐగా ఉన్న శంకరయ్యను కూడా ఇలాగే డిస్మిస్ చేశారని ఆయన కూడా బాబు అసెంబ్లీ సాక్షిగా వివేకా హత్య కేసులో అబద్ధాలు చెబుతున్నారు అని అనడమే పాపం అయింది అని జగన్ అన్నారు. ఈ విధంగా ఎంతమందిని నిరంకుశంగా వ్యవహరించి శిక్షించదలచుకున్నారని జగన్ ప్రశ్నించారు. బాబు పాలనలో సచివాలయం ఉద్యోగులు 250 మంది మరణించారని అలాగే వాలంటీర్లు రోడ్డున పడ్డారని జగన్ గుర్తు చేస్తూ తమ పాలన మీద బాబుకు నమ్మకం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. మొత్తానికి జగన్ విశ్లేషించినట్లుగా బాబు భయపడుతున్నారా అంటే దానికి జవాబు ముందు ముందున కాలమే చెప్పాలేమో.