Begin typing your search above and press return to search.

సీబీఐ విచారణకు సిద్దం, నేను చాలెంజ్ చేస్తున్నా.. గ్రూప్-1పై మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   20 Aug 2026 3:14 PM IST
సీబీఐ విచారణకు సిద్దం, నేను చాలెంజ్ చేస్తున్నా..  గ్రూప్-1పై మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సంచలన ప్రకటన చేశారు. డీఎస్సీలో అక్రమాలపైనా గ్రూప్-1 పరీక్షలపై ఒకేసారి సీబీఐ విచారణ జరగాలని, ఇందుకు కేంద్రానికి లేఖ రాయాలని షరతు విధించారు. గత నాలుగు రోజులుగా డీఎస్సీపై చర్చకు రమ్మంటూ మంత్రి లోకేశ్ తనకు సవాల్ విసిరుతున్న వైనంపై జగన్ పరోక్షంగా స్పందించారని అంటున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1లో ఎటువంటి అక్రమాలు లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన సిట్ తేల్చేసిందని జగన్ వ్యాఖ్యానించారు.

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్సీపై చర్చకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. మండలిలో తమ సభ్యులు చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చర్చకు రావడం లేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీపై చర్చ సందర్భంగా ఫీల్డర్లు లేకుండానే మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా బ్యాటింగ్ చేస్తున్నారని విమర్శించారు.

ఇక తమ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు చంద్రబాబు హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చారని, ఎన్నికల సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ప్రిలిమ్స్ నిర్వహించారని మాజీ సీఎం జగన్ వివరించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ప్రిలిమ్స్ జరగాయని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చింది. అయినా కూడా పదేపదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగన్ రెడ్డి విమర్శించారు.

చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన పరీక్షల ఫలితాలను బయటపెట్టగలరా? అంటూ జగన్ సవాల్ విసిరారు. రిటన్ టెస్టులో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూల్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం, మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ, మీ హయాంలో జరిగిన డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అంటూ జగన్ చాలెంజ్ చేశారు.

కాగా, డీఎస్సీపై చర్చకు రమ్మంటూ మంత్రి నారా లోకేశ్ సవాల్ చేస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మాటల దాడి చేస్తున్న ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు. డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. గ్రూప్-1పై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే సిట్ విచారణ జరిపించింది. ఈ అంశం కోర్టులో ఉండగా, సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ సీఎం సవాల్ చేయడం ద్వారా ప్రభుత్వం మళ్లీ మాట్లాడకుండా నిలువరించ గలిగారని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమంటే డీఎస్సీపైనా విచారణకు రెడీ అవ్వాలని ఒత్తిడి చేయడం ద్వారా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.