ఇరాన్ అధ్యక్షుడి పై ఇజ్రాయెల్ అలా ప్లాన్ చేసింది... షాకింగ్ అప్ డేట్!
ఈ సమయంలో... బీరుట్ లో హెబ్‌బొల్లా నాయకుడు నస్రల్లా ను హత్య చేసినట్లుగానే ఇరాన్ దేశాధ్యక్షుడిని హతమార్చడానికి ఐడీఎఫ్ ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది!
By: Tupaki Desk | 14 July 2025 1:00 AM ISTఇటీవల ఇరాన్ లోని అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధమే నడిచింది. ఈ సమయంలో... బీరుట్ లో హెబ్‌బొల్లా నాయకుడు నస్రల్లా ను హత్య చేసినట్లుగానే ఇరాన్ దేశాధ్యక్షుడిని హతమార్చడానికి ఐడీఎఫ్ ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది!
అవును.. అణుకేంద్రాలే లక్ష్యంగా, అణ్వాయుధ స్థావరాలే టార్గెట్ గానే తమ యుద్ధం అని ఇజ్రాయెల్ ప్రకటించినా.. ఇరాన్ లోని కీలక నేతలు, న్యూక్లియర్ సైంటిస్టులు లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడ్డాయని చెబుతారు. ఆ పని కూడా వారు కొంతమేర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రెసిడెంట్ ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... జూన్ 16న ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఓ భవనంలో నిర్వహించిన ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్, న్యాయవ్యవస్థ చీఫ్ మొహ్సేని ఏజీ, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారని తాజాగా ఐఆర్‌జీసీ వార్తా సంస్థ తెలిపింది.
సరిగ్గా అదే సమయంలో ఆ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని వార్తా సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆ భవనంలో ఉన్నవారు తప్పించుకునే వీలు లేకుండా దానికున్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లను లక్ష్యంగా చేసుకొని.. ఆరు క్షిపణులను ప్రయోగించిందని ఆరోపించింది. పక్కా ప్లాన్ తోనే ఈ దాడులని తెలిపింది.
అయితే... అధికారులు ముందుగానే సిద్ధం చేసుకున్న అత్యవసర హాచ్ ద్వారా తప్పించుకోగలిగారని సదరు వార్తా సంస్థ తెలిపింది. అక్కడి నుంచి తప్పించుకుంటున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సహా పలువురు ఉన్నతాధికారులకు గాయాలు అయినట్లు వెల్లడించింది. హెబ్ బొల్లా నాయకుడు తరహాలో ప్రయత్నించింది కానీ.. ఇరాన్ విషయంలో విఫలమయ్యిందని పేర్కొంది.
కాగా... ఇటీవల ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అటు టెల్ అవీవ్, ఇటు టెహ్రాన్ లో భీకర క్షిపణి దాడులు జరిగాయి. ఈ సమయంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి.. ఇరాన్ లోని మూడు కీలక అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులతో దాడి చేసింది. అనంతరం ఇరు దేశాల మధ్య తనదైన శైలిలో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరించింది.
