సముద్రగర్భ కేబుళ్లను కట్ చేస్తే ఇంటర్నెట్ సంగతేంటి?
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికత పెరిగేకొద్దీ ఈ దూరం మరింత దగ్గరగా మారుతుంటుంది.
By: Tupaki Desk | 20 March 2026 10:03 AM ISTప్రపంచం ఒక కుగ్రామంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికత పెరిగేకొద్దీ ఈ దూరం మరింత దగ్గరగా మారుతుంటుంది. అయితే.. యుద్ధం లాంటి అనిశ్చితి పరిస్థితి వస్తే.. ఈ వ్యవస్తలు మొత్తం ధ్వంసం కావటమే కాదు.. దశాబ్దాల వెనుక్కు వెళ్లే పరిస్థితి. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధం.. ఇప్పుడు కట్టెల పొయ్యిలవరకు వెళ్లేలా చేస్తుంది. అన్నిబాగున్నప్పుడు అంతా బాగున్నట్లే కనిపిస్తుంది. కానీ.. పరిస్థితుల్లో ఏ చిన్న మార్పు చోటు చేసుకున్నా.. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా మారతాయన్న దానికి నిదర్శనంగా తాజా యుద్దాన్ని చెప్పొచ్చు.
ప్రపంచం కోరుకోని యుద్దం ఇప్పుడు జరుగుతోంది. దీని కారణంగా యావత్ ప్రపంచం ప్రభావితం కావటమేకాదు.. ముడి చమురు.. గ్యాస్ సరఫరా సమస్యలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ , అమెరికాను దారికి తెచ్చేందుకువీలుగా అమెరికా మిత్రదేశాల్లోని ముడిచమురు.. గ్యాస్ ప్లాంట్లను టార్గెట్ చేస్తున్న ఇరాన్ ధాటికి యుద్ద వాతావరణం అంతకంతకూ తీవ్రమవుతోంది.
ఇప్పటికే ముడి చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసి వేసిన ఇరాన్.. తనకు నచ్చిన దేశాలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అయితే.. హర్మూజ్ జలసంధి మీద తమకున్న పట్టును ప్రదర్శిస్తున్న ఇరాన్ ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తోంది. తనకు మిత్రులుగా ఉండే చైనా.. రష్యా.. భారత్.. పాకిస్థాన్ లాంటి కొన్ని దేశాలకు అనుమతులు ఇస్తోంది. తమ అనుమతి లేకుండా నౌకల్ని తీసుకొస్తే వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి.
మొత్తంగా చూస్తే అమెరికా దూకుడుకు కళ్లాలు వేయాలని ఇరాన్ ప్రయత్నిస్తుంటే.. ఇరాన్ కు చుక్కలు చూపించైనా సరే.. దారికి తెచ్చుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఏ దిశకు మళ్లుతాయన్నది అంచనా వేయటం కష్టంగా మారింది. మూర్ఖుల మధ్య జరుగుతున్న యుద్దం ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి సాగే సముద్రగర్భ కేబుళ్లకు ఇరాన్ ఏమైనా హాని కల్పిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ కత్తిరిస్తే తర్వాతేమవుతుంది? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
పలు దేశాలకు కమ్యూనికేషన్ కలిపే ఇంటర్నెట్ కేబుళ్లు హార్మూజ్ జలసంధి గుండా వెళుతుంటాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఉంటాయన్నది మర్చిపోకూడదు. యూరోప్.. ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకమైన కేబుల్స్ కట్ చేస్తే.. ఆ ప్రాంతంతో వాణిజ్యం మాత్రమే కాదు ఇంటర్నెట్ కేబుల్స్ కూడా అత్యంత కీలకమైనవి. వీటిని ధ్వంసం చేసినా.. కట్ చేసినా చాలా దేశాల్లో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడుతుంది.
అయితే.. ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని ఇరాన్ తీసుకుంటుందా? అన్నది ప్రశ్న. అయితే.. సముద్రగర్భ కేబుళ్లను కట్ చేస్తే.. ఇంటర్నెట్ వేగం తగ్గుతుందే తప్పించి.. పూర్తిగా దాని సేవలు నిలిచిపోతాయని చెప్పలేమంటున్నారు. దీనికి కారణం గ్లోబల్ డేటా ట్రాఫిక్ కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఇతర మార్గాలు ఎన్ని ఉన్నా.. ఇరాన్ హోర్ముజ్.. బాబ్ ఎల్ మండెబ్ వద్ద కేబుల్స్ ధ్వంసమైతే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుందని మాత్రం చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.
