ఇరాన్ 10 పాయింట్ల శాంతి ప్రణాళికపై అంతర్జాతీయ మీడియా సంస్థలు ఏమన్నాయి?
సీన్ ఒక్కసారిగా మారింది. అణుయుద్ధం అంచుకు ప్రపంచం వెళ్లిందన్న ఆందోళనలు పెద్ద ఎత్తున వ్యక్తమైన వేళ.. ఒక్కసారిగా మేజిక్ జరిగినట్లుగా జరిగింది.
By: Garuda Media | 8 April 2026 10:27 AM ISTసీన్ ఒక్కసారిగా మారింది. అణుయుద్ధం అంచుకు ప్రపంచం వెళ్లిందన్న ఆందోళనలు పెద్ద ఎత్తున వ్యక్తమైన వేళ.. ఒక్కసారిగా మేజిక్ జరిగినట్లుగా జరిగింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే చెప్పటం.. అందుకు ప్రతిగా ఇరాన్ సైతం సమ్మతిని తెలపటం.. వీరితో పాటు ఇజ్రాయెల్ కూడా పెద్దన్న దారిలోనే నడుస్తానని చెప్పటం తెలిసిందే. పాకిస్తాన్ ప్రధాని మధ్యవర్తిత్వంతో ఇదంతా జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎ్తతు అయితే.. తాను రెండు వారాల కాల్పుల విరమణకు ఓకే చెప్పిన ఇరాన్.. తన పది పాయింట్ల శాంతి ప్రణాళికను తెర మీదకుతీసుకురావటమే కాదు ట్రంప్ నకు పంపింది. దీనిపై ఆయన ఓకే చెప్పారు. ఈ అంశాలపై తదుపరి చర్చ మరో రెండు రోజులు (ఏప్రిల్ 10) ఇస్లామాబాద్ వేదికగా జరగనుంది.
ఆశ్చర్యకరంగా ఇరాన్ పేర్కొన్న 10 పాయింట్ల శాంతి ప్రణాళిక మొత్తం ఇరాన్ కు అనుకూలంగా.. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ విరమణకు టర్మ్ డిక్టేట్ చేసినట్లుగా ఉంది. అందులో అమెరికాకు తలవంచుతున్నట్లు కానీ.. వెనక్కి తగ్గుతున్నట్లు కానీ లేదు.నిజానికి పది పాయింట్ల శాంతి ప్రణాళికలోని అంశాలు.. దాని టోన్ విషయంలో మామూలుగా అయితే అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యేలా చేయాలి. ఆశ్చర్యకరంగా ఇరాన్ 10 పాయింట్ల శాంతి ప్రణాళికను స్వాగించటమే కాదు.. దానిపై తదుపరి చర్చలు ఉంటాయని చెప్పటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఈ అంశాలపై అంతర్జాతీయంగా దిగ్గజ మీడియా సంస్థల స్పందన ఏంటి? వారు ఈ అంశంపై తమ కథనాల్లో ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించారన్నది ఆసక్తికరం. ఈ స్పందనకు సంబంధించి క్లుప్తంగా ఆయా మీడియా సంస్థల స్పందన చూస్తే.. పలు అంశాలు కనిపిస్తాయి.
బీబీసీ (బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ)
ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ అంగీకరించడం ఒక "వ్యూహాత్మక వెనకడుగు"గా అభివర్ణించటంతో పాటు..పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ ఒక 'గౌరవప్రదమైన నిష్క్రమణ' కోసం వాడుకున్నారని విశ్లేషించింది. హోర్ముజ్ జలసంధిని తెరిపించడం ద్వారా ప్రపంచ చమురు సంక్షోభాన్ని నివారించడమే అమెరికా తక్షణ లక్ష్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
సీఎన్ఎన్ (అమెరికాకు చెందిన మీడియా సంస్థ)
ట్రంప్ తన కఠినమైన 'డెడ్‌లైన్' నుంచి నాటకీయంగా తప్పుకున్నారంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ డిమాండ్లు (నష్టపరిహారం వంటివి) అమెరికాకు ఆమోదయోగ్యం కాదు. అయినా.. చర్చలకు ఒప్పుకోవడం వెనుక అంతర్జాతీయ ఒత్తిడి ప్రధాన కారణమని పేర్కొంది. ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా లేదా అనేది ఏప్రిల్ 10 చర్చల తర్వాతే తెలుస్తుందని విశ్లేషించింది.
అల్ జజీరా (ఖతార్)
ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్లు పశ్చిమ ఆసియాలో ఇరాన్ పట్టును నిరూపిస్తున్నాయని పేర్కొంది. "అమెరికా దళాల ఉపసంహరణ" డిమాండ్‌ను ఇరాన్ గట్టిగా వినిపించడం ద్వారా ప్రాంతీయ శక్తిగా ఎదిగిందని ప్రశంసించింది. ముస్లిం చొరవను ఇది హైలైట్ చేస్తోందని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ కు ఇమేజ్ పెంచేలా ఈ సంస్థ వ్యాఖ్యలు ఉన్నాయి.
ది న్యూయార్క్ టైమ్స్ (అమెరికా)
యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ‘వర్కబుల్ బేసిస్ (ఆచరణాత్మక ప్రాతిపదన) పదాన్ని ట్రంప్ వాడటం అంటే.. ఇరాన్ షరతులను పూర్తిగా కాకున్నా.. కొంతమేర చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా విశ్లేషించింది.
రాయిటర్స్ (బ్రిటిష్ - కెనడియన్/అంతర్జాతీయ మీడియా సంస్థ)
ఇరాన్ పెట్టిన 2 మిలియన్ డాలర్ల షిప్పింగ్ ఫీజు ప్రతిపాదన అంతర్జాతీయ వాణిజ్యానికి సవాలుగా మారుతుందని హెచ్చరించింది. కాల్పుల విరమణ వార్తతో ప్రపంచ మార్కెట్లు కోలుకున్నాయని, ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గాయని విశ్లేషించింది.
ది గార్డియన్ (బ్రిటన్)
ట్రంప్ హెచ్చరికల వెనుక ఉన్న డ్రామాను విమర్శించింది. "వినాశకర దాడులు చేస్తానన్న ట్రంప్, ఇప్పుడు శాంతి ప్రవచనాలు పలకడం విడ్డూరం" అని పేర్కొంది. ఇరాన్ అణు హక్కుల గుర్తింపు డిమాండ్‌ను అమెరికా ఎలా అంగీకరిస్తుంది? అనే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిందన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.
ఫాక్స్ న్యూస్ (అమెరికా/ట్రంప్ కు మద్దతు ఇచ్చే మీడియా సంస్థ)
ట్రంప్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించి, ప్రపంచ యుద్ధాన్ని నివారించారని ప్రశంసించింది. ఇరాన్ లొంగివచ్చి చర్చలకు సిద్ధపడిందని పేర్కొంది. ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ వ్యూహానికి లభించిన విజయంగా పేర్కొంది.
బ్లూమ్ బర్గ్ (అమెరికా/అంతర్జాతీయ ఆర్థిక మీడియా సంస్థ)
ఈ శాంతి ప్రణాళిక ప్రధానంగా ఆర్థిక లావాదేవీల చుట్టూ తిరుగుతోందని విశ్లేషించింది. స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదల మరియు ఆంక్షల తొలగింపు ఇరాన్‌కు ప్రాణవాయువు లాంటిదిగా పేర్కొంది.
డాన్ (పాకిస్తాన్)
పాకిస్థాన్ దౌత్య విజయాన్ని కొనియాడింది. అగ్రరాజ్యం.. ఇరాన్ మధ్య సంధి కుదర్చడంలో పాక్ కీలక పాత్ర పోషించిందని హైలైట్ చేసింది. ఇస్లామాబాద్ చర్చలు ప్రపంచ చరిత్రలో కీలక మలుపు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
జెరూసలెం పోస్టు (ఇజ్రాయెల్)
ఈ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ఆందోళనగా ఉందని పేర్కొంది. ఇరాన్‌కు సమయం ఇవ్వడం వల్ల వారు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని.. అమెరికా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
