Begin typing your search above and press return to search.

సర్వే.. ఆ మీడియా చానెల్‌ కథనానికి ఐప్యాక్‌ ఖండన!

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ కీలక పాత్ర పోషించింది

By:  Tupaki Desk   |   31 Aug 2023 10:30 AM GMT
సర్వే.. ఆ మీడియా చానెల్‌ కథనానికి ఐప్యాక్‌ ఖండన!
X

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా ఐప్యాక్‌ వైసీపీకి సేవలందిస్తోంది. దీని నివేదికలు, సర్వేలు ఆధారంగానే వైసీపీ అధినేత జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ తరఫున కొత్త కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారని టాక్‌. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కూడా ఐప్యాక్‌ నివేదికల ఆధారంగానే ఉంటుందని అంటున్నారు.

కాగా ఐప్యాక్‌ సర్వే నిర్వహించిందని.. అందులో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్టు తేలిందని పేర్కొంటూ ఒక టీవీ చానెల్‌ పేర్కొనడాన్ని ఐప్యాక్‌ ఖండించింది. తామెలాంటి సర్వేలు నిర్వహించలేదని పేర్కొంది. ఆ మీడియా చానెల్‌ కథనం వాస్తం కాదని వెల్లడించింది. ఈ మేరకు ఐప్యాక్‌ తాజాగా ట్వీట్‌ చేసింది.

ఐప్యాక్‌ తన ట్వీటులో ఆ మీడియా చానెల్‌ పేరును పేర్కొనలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఆ మీడియా చానెల్‌ టీడీపీ అనుకూల చానెల్‌ గా ముద్ర పడిందని అంటున్నారు. ఆ చానెల్‌ కు అనుబంధంగా పత్రిక కూడా ఉందని.. ఆ పత్రిక సైతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

కాగా ఐప్యాక్‌ చేసిన సర్వేలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని ఆ మీడియా చానెల్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీటును ఐప్యాక్‌ అధికారిక హ్యాండిల్‌ కు కూడా ట్యాగ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐప్యాక్‌ స్పందించింది. తామెలాంటి సర్వేలు నిర్వహించలేదని వెల్లడించింది. ఈ మేరకు ఆ చానెల్‌ కథనాన్ని ఖండించింది.

''ఐప్యాక్‌ ఎటువంటి సర్వేలను నిర్వహించలేదు. మీడియా/సోషల్‌ మీడియా ప్లాట్‌పారమ్‌ లలో మాకు ఆపాదించబడిన సర్వే ఏదైనా అది పూర్తిగా అవాస్తవం, అబద్దం. ఈ సర్వే వార్తలు నిరాధారం. తమ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు, గ్రూపులు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు'' అని ఐప్యాక్‌ ట్వీట్‌ చేసింది. ఈ తప్పుడు సర్వేలను చూసి ప్రజలు తప్పుదోవ పట్టవద్దని విజ్ఞప్తి చేసింది.

కాగా ఐప్యాక్‌ చేసిందిగా చెప్పబడుతున్న సర్వేలో ఏముందంటే..

''కడప, రాజంపేట, అరకు.. ఈ మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. టీడీపీ 15 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మరో ఏడు లోక్‌సభ స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఆధిక్యత ఉంది''.

ఈ నేపథ్యంలో వైసీపీకి గరిష్టంగా 35-50 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీకి 100కు పైగా సీట్లు వస్తాయని ఐప్యాక్‌ సర్వే పేర్కొన్నట్టు ఆ చానెల్‌ పేర్కొంది. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే కూటమిదే విజయమని ఐప్యాక్‌ వెల్లడించినట్టు కూడా ఆ చానెల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఐప్యాక్‌ తామెలాంటి సర్వేలు నిర్వహించలేదని స్పష్టత ఇచ్చింది.