Begin typing your search above and press return to search.

ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్... ఏపీలో అడ్డగోలు సర్వేనా?

ఈ సమయంలో ఇండియా టీవీ సర్వే ఫలితాలు తెరపైకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   3 April 2024 9:37 AM GMT
ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్... ఏపీలో అడ్డగోలు సర్వేనా?
X

ఆంధ్రప్రదేశ్ లో మరో నెలాపదిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసి, ప్రచారాలకు తెరలేపాయి. ఒకపక్క జగన్, మరో పక్క చంద్రబాబు, ఇంకోపక్క పవన్ లు ప్రచారాలతో ఊదరగొట్టేస్తున్నారు! ఇదే సమయంలో విమర్శలు, పతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కిపోతుంది. ఈ సమయంలో ఇండియా టీవీ సర్వే ఫలితాలు తెరపైకి వచ్చాయి.

అవును.. ఎన్నికల సీజన్ వచ్చిందంటే... రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తల సందడితో పాటు ప్రధానంగా సర్వే సంస్థల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది! ఇప్పటికే ఏపీలోని లోక్ సభ ఎన్నికలపై పలు సర్వేలు తెరపైకి వచ్చాయి. అయితే... ఆ సర్వే సంస్థల్లో మెజారిటీ సర్వే ఫలితాలకు విభిన్న ఫలితాలతో తాజాగా ఇండియా టీవీ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!!

ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్... ఒపీనియన్ పోల్ నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 200 స్థానాలు సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో... గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది!

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5, బీఆరెస్స్ 2, ఎంఐఎం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. అంటే.. గత ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన దూకుడే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చూపించే అవకాశం ఉందన్నమాట.

ఇక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... టీడీపీ 12 సీట్లు, వైసీపీకి 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఇండియా టీవీ సర్వే తేల్చింది. ఇదే క్రమంలో బీజేపీ 3 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనీ వెల్లడించింది. జనసేన ఒక్క చోట కూడా చెప్పలేదు . అంటే... ఏపీలో ఓటర్లను కూటమికి ఓటు వేస్తారా వైసీపీ ఓటు వేస్తారా అని అడగకుండా... టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీలలో ఎవరికి ఓటు వేస్తారు అని ప్రశ్నించారా అనే సందేహం తెరపైకి వస్తుంది.

ఒకవేళ అలాగే ఒపీనియన్ పోల్ తీసుకుని ఉంటే... కూటమిలో భాగంగా ఉదాహరణకు “ఎక్స్” అనే లోక్ సభ స్థానంలో “వై” అనే అభ్యర్థి కూటమి తరుపున నిలబడితే... కూటమిలోని మిగిలిన రెండు పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమిలోని అభ్యర్థి గెలుస్తున్నారు లేక ఓడుతున్నారు.. బీజేపీ, జనసేనల విషయంలో ఇదే వర్తిస్తుందని చెప్పాలకున్నారా..? ఇప్పుడు నెటిజన్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి!

పైగా గత ఎన్నికల్లో జనసేనకు సుమారు 6 శాతం వరకూ ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి ఇండివిడ్యువల్ గా వచ్చిన ఓట్ల శాతం 1 కంటే తక్కువ!! అలాంటి బీజేపీ.. కూటమితో సంబంధం లేకుండానే 3 లోక్ సభ స్థానాలు అంటే సుమారు 21 అసెంబ్లీ స్థానల్లో మెజారిటీ ఓట్లు సంపాదించుకోగలదని ఈ సర్వే చెబుతున్నట్లయ్యింది! ఇదే నిజమైతే... కూటమితో సంబంధం లేకుండా... టీడీపీ, బీజేపీ, జనసేన కు ఓటు వేసే ఓటర్లు అన్ని నియోజకవర్గాల్లోనూ ఎవరి పార్టీకి వారే ఓట్లు వేసుకుంటారని అయినా భావించాలా?

ఇలా పరిపూర్ణమైన అస్పష్టతతో ఈ సర్వే ఉందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో... ఏదో చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ అడ్డగోలు సర్వేను ఏపీ ప్రజలపైకి వదిలారా అనే అభిప్రాయాలనూ వ్యక్తపరుస్తున్నారు. దీంతో... ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్ జరిపిన సర్వేలో ఎన్ని శాంపుల్స్ తీశారు.. ఏమేమి ప్రశ్నలు అడిగారు.. ఏపీలోని ఏయే ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారో కూడా చెప్పాలని.. అలాకానిపక్షంలో ఇది “బ్లఫ్” అని భావించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!