వికసిత్ భారత్‌లో రాష్ట్రాల కష్టాలు.. హిమాచల్ స్థితి దయనీయం!
2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దీనికి కొంత సమయం ఉంది.
By: Garuda Media | 22 April 2026 1:01 PM IST2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 100 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దీనికి కొంత సమయం ఉంది. అయితే.. ఈ లోగానే వికసిత్ భారత్ అంటూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పెద్ద నినాదమే అందుకుంది. తద్వారా.. 2047 నాటికి దేశాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లాలన్నది లక్ష్యం. అయితే.. ఏకార్యమైనా సాధించేందుకు.. ఆర్థిక వనరులే ముఖ్యం. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు.. రాష్ట్రాల హక్కులు.. ఆర్థిక వనరులను కూడా అతలాకుతలం చేస్తున్నాయని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ వాదన గత 8-10 ఏళ్ల నుంచి వినిపిస్తోంది.
జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి.. రాష్ట్రాలను ఆర్థికంగాబలోపేతం చేస్తామని.. 2017లో పార్లమెంటులో ప్రధాని మోడీ చేసిన ప్రకటన ఇప్పటికీ గుర్తుంది. కానీ, ఆ తర్వాత.. ఏం జరిగింది? రాష్ట్రాలకు ఇచ్చే వాటాను జనాభా ప్రాతిపదికన లెక్కించి విదిలించడం ప్రారంభించారు. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మేలు జరుగుతోంది. తక్కువగా ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. పోనీ.. కేంద్రం ఇస్తున్న గ్రాంట్లు.. ఇన్‌సెంటివ్‌లు కొనసాగుతున్నాయా? అంటే.. వీటిని కేంద్రం ఏనాడో పక్కన పెట్టింది. అదేసమయంలో అప్పులు చేసుకునేందుకు.. రాష్ట్రాలకు గేట్లు ఎత్తింది. పైగా.. సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మరిన్ని అప్పులు ఇస్తామని 2020లో ప్రకటించారు.
ఫలితంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయింది. దీంతో ఇప్పుడు అప్పులు లేని రాష్ట్రం అంటూ.. ఏదీ లేదు. 1990లలో కొన్ని రాష్ట్రాలు సగర్వంగా తమకు ఏ అప్పూలేదని ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నా యి. కానీ, ఇప్పుడు తక్కువ అప్పులు చేస్తున్నామని చెప్పుకొనే దుస్థితికి దిగజారాయి. దీనికి కారణం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు ఈ ప్రస్తావన.. రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న ప్రేమ ఎందుకు చర్చకు వచ్చాయంటే.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని గొప్ప నిర్ణయం అని చెప్పలేం. ఎందుకంటే.. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు... ఎమ్మెల్యేల నుంచి అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగుల దాకా.. వేతనాల్లో కోత పెట్టారు.
ఎంతగా అంటే.. 50 శాతం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు కోత పెట్టగా.. 20 నుంచి 30 శాతం సాధారణ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. అంతేకాదు.. ఈ జీతాలను కూడా వచ్చే మూడు నాలుగు మాసాల వరకు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే.. అప్పుల భారం మోయలేక.. రాష్ట్రానికి ఆదాయం రాక!. నిజం.. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పుడు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. సంక్షేమ పథకాల నుంచి వేతనాలు, పింఛన్ల వరకు కూడా సర్కారుపై భారం పెరిగింది. పోనీ కేంద్రం నుంచివచ్చే వాటా ఉందా? అంటే.. జనాభా ప్రాతిపదికన జరుగుతోంది. ఫలితంగా ఏ పనిచేయాలన్నా.. అప్పుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని గొప్పగా చెప్పుకోవాలో.. లేక దుస్థితి ఉందని చాటుకోవాలో అర్థం కాని పరిస్థితి.
హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. ఇక, ఈ పరిస్థితి ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు. అప్పుల కుప్పలుగా మారుతున్న దక్షిణాది రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. అయితే.. పంటి బిగువున భరిస్తున్నారు. రాజకీయం కోసం దాచుకుంటున్నారు అంతే!. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే.. ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. ఆయన పలు మార్లు చెప్పారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు కూడా తరచుగా ఇదే పాట పాడుతున్నారు. తమిళనాడులోనూ అప్పులు పెరిగిపోయాయని.. ఇటీవలే కాగ్ నివేదిక వెల్లడించింది. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మొత్తంగా వికసిత్ భారత్‌లో రాష్ట్రాలు అప్పుల కుప్పలుగా మారడం.. వేతనాలకు కోత పెట్టుకోవడం వంటి పరిణామాలు దేశంలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.
రాజకీయాలూ కారణమే!
ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా చర్చించాలి. రాష్ట్రాల్లో అధికారం కోసం వెంపర్లాడుతున్న రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ.. ప్రజలకు కుప్పలు తెప్పలుగా కురిపిస్తున్న సంక్షేమ పథకాల వరద కూడా రాష్ట్రాలను అప్పుల మయం చేస్తున్నాయి. వారానికోసారి.. రిజర్వ్ బ్యాంకు ముందు నిలబడేలా చేస్తున్నాయి. ప్రత్యర్థులకు పోటీగా ఇస్తున్న పథకాల ప్రకటనలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమలు చేయక తప్పని పరిస్థితులు కూడా రాష్ట్రాలను అప్పులబాట పట్టేలా చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు అప్పుల పాలు కావడానికి సంక్షేమం కూడా కలసి వస్తోందన్న వాదనను ఎవరూ విస్మరించలేనిది కావడం గమనార్హం.
