టాప్-100లో నలుగురు తెలుగు నేతలు.. జగన్-కేసీఆర్ అవుట్! అసలు కారణం ఇదే..
దేశంలో శక్తివంతమైన వంద మంది నేతల జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
By: Tupaki Desk | 30 March 2026 4:00 AM ISTదేశంలో శక్తివంతమైన వంద మంది నేతల జాబితాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ ఇద్దరు వరుసగా 12వ ఏడాది ఈ జాబితాలో ఆధిపత్యం కొనసాగించడం విశేషం. ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన ఈ జాబితాలో నలుగురు తెలుగు నేతలు మెరుగైన ర్యాంకులు దక్కించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13వ స్థానంలో నిలవగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 25వ స్థానానికి ఎగబాకారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 68వ ర్యాంకును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారు. కాగా, ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలు, మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహనరెడ్డి, కేసీఆర్ పేర్లు కనిపించలేదు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించిన 2026 'శక్తివంతమైన వంద మంది భారతీయుల' జాబితా దేశ రాజకీయ ముఖచిత్రంలో వస్తున్న పెను మార్పులకు అద్దం పడుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి మారిన రాజకీయ సమీకరణాలు ఈ లిస్టులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, ఐసీసీ అధ్యక్షుడు జై షా 22 స్థానంలో నిలిచారు.
దేశంలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు, వివిధ పార్టీల అధినేతల పనితీరును విశ్లేషిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది. అధికారం కోల్పోవడం, దాదాపు రెండేళ్ల నుంచి పెద్దగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించకపోవడం కారణంగా మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహనరెడ్డి ఈ జాబితాలో చోటుకోల్పోయారని అంటున్నారు. జగన్ సీఎంగా పనిచేసిన కాలంలో ఏటా 50వ ర్యాంకు లోపే ఉండేవారు. కానీ, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన స్థానం గల్లంతైందని మీడియా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జగన్ కేంద్ర ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తూ చక్రం తిప్పేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ఆయన పాత్ర నామమాత్రంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. అటు కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల నుంచి వెనక్కి తగ్గి రాష్ట్రానికే పరిమితమవ్వడం మరో కారణంగా చెబుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గతం కంటే మెరుగైన ర్యాంకులు సాధించారు. ఏపీ సీఎం చంద్రబాబు గత ఏడాది 14వ స్థానంలో నిలవగా, ఇప్పుడు ఒక స్థానం మెరుగుపరుచుకున్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థానంలో గణనీయ మార్పు నమోదు చేశారు. చంద్రబాబు కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో 'కింగ్ మేకర్'గా ఉండటం, అమరావతి నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం చేయడం, ఏపీలో పెట్టుబడుల వరద వంటి అంశాలతో దేశంలోనే అత్యంత కీలక నేతగా మారారని అంటున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుగుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెబుతున్నారు. 2024లో 39వ స్థానంలో, 2025లో 28వ స్థానంలో ఉన్న ఆయన, ఇప్పుడు ఏకంగా 25వ స్థానానికి చేరారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఆయనకు పెరిగిన ప్రాధాన్యత దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. కాగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా శక్తిమంతమైన నేతలుగా నిరూపించుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జాబితాలో తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నారు.2025లో 73వ స్థానంలో ఉన్న పవన్, ఈ ఏడాది 68వ స్థానానికి చేరుకున్నారు. కేవలం సినిమా గ్లామర్ మాత్రమే కాకుండా, ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన అధినేత పోషిస్తున్న పాత్రకు తగిన గుర్తింపు లభిస్తోందని అంటున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లో ఆయన చేస్తున్న క్షేత్రస్థాయి పర్యటనలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న శ్రద్ధ జాతీయ స్థాయిలో ఆకర్షిస్తోంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా ఆయన పనితీరు అందరినీ మెప్పిస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా గతేడాది విమానయాన రంగంలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు, విమాన ప్రమాదాల సమయంలో ఆయన స్పందించిన తీరు, సామాన్యుడికి విమాన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు చేపట్టిన సంస్కరణలతో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటులో తెలుగు గళాన్ని బలంగా వినిపించడం కూడా ఆయనకు ప్లస్ అయ్యిందని చెబుతున్నారు.
