Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అతిపెద్ద 'తరలింపు'!

ఈ నేపథ్యంలో భారత ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి

By:  Tupaki Desk   |   18 March 2024 9:24 AM GMT
ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు!
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. భారత్‌. ఈసారి దాదాపు 98 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు, ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌ సభలో 543 ఎంపీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. 18వ లోక్‌ సభకు ఎన్నికలు ఏప్రిల్‌ 19న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్‌ 1న తదుపరి దశలు జరుగుతాయి. 543 లోక్‌ సభ నియోజకవర్గాల్లో దాదాపు 97 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఓట్లు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు.

ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాటు చేసింది. దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్, భద్రతా సిబ్బందిని 55 లక్షల ఈవీఎంలు, నాలుగు లక్షల వాహనాలను జల, వాయు, భూమార్గాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తరలించనుంది. ఈ నేపథ్యంలో ఈ తరలింపు ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కానుంది. అలాగే ఎన్నికలకు అవసరమయ్యే 26 లక్షల ఇంక్‌ బాటళ్లను కర్ణాటకలోని మైసూరు నుంచి దేశమంతా తరలించనున్నారు.

ఎన్నికలకు సంబంధించి భారీ కసరత్తును నిర్వహించాలని ఆదేశించిన ఎన్నికల సంఘం ఇందుకు ముందునుంచే ఏర్పాట్లు చేసింది. ఏడాదిన్నర ముందుగానే అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతోపాటు అవసరమైన ఈవీఎంలు, చెరగని సిరా సరఫరాను వేగవంతం చేసింది. తద్వారా ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది.

ఇందులో భాగంగా గత ఏడాది జూన్‌ లో దేశవ్యాప్తంగా ఈవీఎంలు, ట్రయిల్‌ మెషీన్‌ ల మొదటి స్థాయి తనిఖీలను దశలవారీగా ప్రారంభించింది. వాటితో మాక్‌ పోలింగ్‌ ను నిర్వహించింది. ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధల మేరకు ఈవీఎంలకు అధికారులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.

ఈవీఎంలు, పేపర్‌ ట్రయిల్‌ మెషీన్లు తయారుచేసే భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఇంజనీర్లతో ఈవీఎంలకు తనిఖీలు నిర్వహించారు. వాటిలో ఏవైనా మెకానికల్‌ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేశారు. లోపభూయిష్ట యంత్రాలు ఏమైనా ఉంటే వాటిని తిరిగి మరమ్మతుల కోసం తయారీ కంపెనీలకు ఇస్తారు.