Begin typing your search above and press return to search.

పాక్‌కు చుక్కలు చూపించేందుకు భారత్ పక్కా ప్లాన్!

భారత్ పక్కా ప్లాన్‌తో యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న అడుగులు పాక్ మీద భారీ దాడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 May 2025 5:00 PM IST
India Readies for Retaliation: Strong Military Build-up Against Pakistan
X

ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ మనదేశం మీద కయ్యానికి కాలుదువుతున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు మన సత్తా చాటేలా, పాక్‌ను చిత్తు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోందా? పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ను మట్టికరిపించేందుకు త్రివిధ దళాలతో భారత్ సిద్ధమైందా? అంటే, అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.

భారత్ పక్కా ప్లాన్‌తో యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న అడుగులు పాక్ మీద భారీ దాడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, పాక్‌పై మూడు వైపుల నుంచి దాడి చేసేందుకు రెడీ అయ్యారు. పాక్‌కు ఊపిరి సలపకుండా దెబ్బకొట్టేందుకు బ్లూప్రింట్ కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం.

వారం రోజుల్లో కార్యచరణ ప్రారంభించి, నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి భారత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధంగా ఉంది. ఎల్ఓసీ వెంబడి ఎనిమిది చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడితే, భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఇప్పటికే సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించి భారత్ సిద్ధమవుతోంది.

పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా పాక్ మీద త్వరలో భారీ దాడి జరగబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులను కొనుగోలు చేసి భారత్ సమరానికి సై అంటోంది. ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతూ యుద్ధ సన్నద్ధతపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ తమపై ఎదురుదాడి చేస్తే తిప్పికొట్టేందుకు భారత్ అన్ని రకాల ఆయుధాలతో సిద్ధమవుతోంది.

వ్యూహ, ప్రతివ్యూహాలతో త్రివిధ దళాలు పాకిస్థాన్‌ను చుట్టుముట్టి కోలుకోలేని విధంగా దెబ్బకొట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ వారం మరోసారి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వేగంగా మారుతున్న పరిణామాలు భారత్ పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తాయనే భావన కలిగిస్తున్నాయి. యుద్ధమే జరిగితే భారత్ ప్రపంచానికే తమ సత్తా తెలిసేలా చేయాలనే ప్లాన్‌లో ఉంది.