భారత్ లో పేదలు ఏడు కోట్లేనట !
భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా ఉంది. భారత్ కి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఏడున్నర దశాబ్దాల కాలం అయింది.
By: Tupaki Desk | 8 Jun 2025 8:00 AM ISTభారత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా ఉంది. భారత్ కి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఏడున్నర దశాబ్దాల కాలం అయింది. భారత్ తో పాటు గా స్వాతంత్ర్యం పొందిన దేశాలు కానీ అదే సమయంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిన దేశాలు కానీ చాలా ముందుకు వెళ్ళిన సంగతిని కూడా గుర్తు చేస్తూ ఉంటారు.
ఇక భారత్ అభివృద్ధి ఇపుడు వేగంగా సాగుతోందని చెబుతున్న అభివృద్ధి చెందిన దేశం అన్న ట్యాగ్ ఎపుడు దక్కుతుంది అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇదిలా ఉండగా భారత దేశంలో పేదరికం చాలా ఎక్కువ అని చెబుతారు. ఈ దేశంలో 140 కోట్లకు పైగా జనాభాలో నలభై శాతం పేదలు ఉన్నాయని గతంలో అనేక గణాంకాలు వెల్లడించాయి. అంటే దాదాపుగా యాభై కోట్ల దాకా అన్న మాట.
అయితే ఈ పేదరికం ఒక్కసారిగా గాయబ్ అయ్యారని అంటున్నారు. అది ఎవరో చేసిన సర్వే కాదు మరెవరో తయారు చేసిన గణాంకాల నివేదిక కానే కాదు, ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఒక నివేదిక. గడచిన దశాబ్ద కాలంలో భారత్ లో పేదరికం పెద్ద ఎత్తున తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది.
ఇక చూస్తే కనుక 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరికం నుంచి 2022-23 నాటికి 5.3 శాతానికి పేదరికం రేటు పడిపోయిందని పేర్కొంటోంది. ఇక ఈ మధ్య కాలంలో సుమారుగా 26.9 కోట్ల మందికి తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందారని ఆ నివేదిక చెబుతోంది. బహుముఖ పేదరిక సూచీ కూడా 2022-23 నాటికి 15.5 శాతానికి తగ్గుదలగా ఉందని వివరించింది.
ఈ మార్పు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చూసుకుంటే సమానంగా కనిపించడం గమనార్హమని ఈ నివేదికలో పేర్కొంటున్నారు. ఈ నివేదికను ఒక్క సారి పరిశీలిస్తే 2011 నాటికి భారత్ లో 16.2 శాతంగా తీవ్ర పేదరికంలో ఉన్న భారతీయులు అదే 2022-23 నాటికి 2.3 శాతానికి తగ్గారని వివరించింది. అంటే 2011లో 20.59 కోట్ల మంది జనాభా తీవ్ర పేదరికంలో ఉంటే 2022 నాటికి 3.36 కోట్లకు ఆ సంఖ్య తగ్గింది అని చెబుతోంది ఈ నివేదిక.
ఇక పల్లెలలో చూసుకుంటే తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గింది. అదే పట్టణ ప్రాంతాలలో ఇది 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో తీవ్రమైన పేదరికం తగ్గిందని వివరించి మరీ చెబుతోంది ఈ నివేదిక. ఇలా తీవ్రమైన పేదరికం నుంచి బయటపడడానికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు కారణం అని అంటోంది ఈ నివేదిక
తద్వారా 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడంలో ఈ పధకాలు సహాయపడ్డాయని ఆర్ధిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉందని అంటున్నారు. భారత దేశంలో తీవ్రమైన పేదరికం నుంచి మాత్రమే ఈ పాతిక కోట్ల మంది బయటపడ్డారు అన్నది ఈ నివేదిక సారాంశం. అంటే సాధారణ పేదరికం అలాగే ఉందని ఈ నివేదికను బట్టి అనుకోవచ్చా అన్నది ఒక సందేహం.
ఇక తీవ్రమైన పేదరికం అంటే నిర్వచనం చెప్పలేదు. కానీ కనీసం ఒక పూటకు కూడా పిడికెడు అన్నం దక్కని వారు అని భావించవచ్చు. ఇపుడు వారికి పధకాల పుణ్యమాని అది దక్కుతోంది. అంతే తప్ప వారి ముంగిటి నుంచి పేదరికం ఇంకా వీడలేదు అన్నది కూడా నిపుణులు విశ్లేషణగా ఉంది.
ఈ దేశంలో అయిదు నుంచి పది శాతం సంపన్నులు ఉన్నారు. అలాగే ఎగువ మధ్యతరగతి వర్గాలు మరో పది శాతం ఉంటారు. ఈ రెండూ తీసేస్తే మిగిలిన వర్గాలు అన్నీ పేదరికంతోనే ఉన్నాయన్నది ఒక కచ్చితమైన నివేదికగా ఉంది. అంతదాకా ఎందుకు ఈ రోజుకీ ఎనభై కోట్ల మంది ప్రజలను పేదలుగా గుర్తించి ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రేషన్ సరుకులు ఇస్తున్నాయి. అంటే భారత్ లో పేదరికం ఇంకా అలాగే ఉందని వీటిని బట్టి అర్ధం అవుతోంది.
ఇక ఏడున్నర దశాబ్దాలు అంటే చాలా ఎక్కువ అని అంటున్నారు. మరి తీవ్రమైన పేదరికం నుంచి సాధారణ పేదరికంలోకి రావడానికి ఇంతటి సుదీర్ఘమైన కాలం పడితే అసలు పేదరికం లేని దేశంగా భారత్ ఎపుడు ఆవిర్భవిస్తుంది అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది. దీనికి జవాబు కోసం ఇంకా చాలా కాలం చాలా దూరం ప్రయాణించాల్సిందే అని అంటున్నారు మేధావులు.
