రాష్ట్రపతి ముందు రెడ్ ఫైల్... ఇక అతి భీకరమే !
గట్టిగా భారతీయులు అంతా కలిసి గాలి వదిలితే అదే సుడిగాలిగా సునామీగా మారి పాకిస్థాన్ అందులో కొట్టుకుని పోతుంది అని అంటూంటారు
By: Tupaki Desk | 24 April 2025 10:13 PM ISTభారత్ ఇక అతి భీకరమైన యుద్ధానికి తెర తీసే సూచనలు కనిపిస్తున్నాయి. గట్టిగా భారతీయులు అంతా కలిసి గాలి వదిలితే అదే సుడిగాలిగా సునామీగా మారి పాకిస్థాన్ అందులో కొట్టుకుని పోతుంది అని అంటూంటారు. ఇపుడు అలాంటి పరిస్థితినే పాక్ చూడబోతోంది అని అంటున్నారు.
ఏ విధంగా చూసినా భారత్ తో సమ ఉజ్జీ కానీ పాక్ కి శాశ్వతమైన గుణపాఠం చెప్పడానికి భారత్ చూస్తోంది అని అంటున్నారు. నిన్నా అమిత్ షా రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదుల భరతం పడతాం అని చేసిన వ్యాఖ్యలకు మించి ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ లో మాట్లాడుతూ వెంటాడి వేటాడి భారత్ ఏంటో ఉగ్ర మూకలకు చూపిస్తామని గర్జించిన తీరు చూసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్ధం అవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్రపతి సర్వ సైన్య అధ్యక్షురాలు అయిన ద్రౌపది ముర్ము వద్దకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ వెళ్ళి తాజా పరిణామాలు కాశ్మీర్ ఉగ్ర దాడి గురించి ఆమెకు వివరించారు అని చెబుతున్నారు. అంతే కాదు రాష్ట్రపతి ముందు రెడ్ ఫైల్ ని ఉంచారని అంటున్నారు.
మరి ఆ రెడ్ ఫైల్ లో ఏమి ఉందో తెలియదు కానీ పాకిస్థాన్ మీద భయంకరమైన ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతోంది అని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే వివిధ దేశాలకు చెందిన రాయబారులకు భారత్ ఉగ్ర దాడి గురించి వివరించింది. భరత విదేశాంగ శాఖ అధికారులు రష్యా జర్మనీ, జపాన్, పోలెండ్, యూకే, తదితర ఇరవైకి పైగా దేశాలకు చెందిన రాయబారులతో ఈ ఉగ్రదాడి వెనక ఎవరు ఉన్నారో కూడా పూసగుచ్చినట్లుగా వివరించారు అని అంటున్నారు.
ఇక ఈ ఉగ్ర దాడికి పాల్పడింది తామే అని లష్కరే తోయీబా అనుబంధ ఉగ్ర సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ ప్రమేయం కూడా ఈ దాడి వెనక ఉందని స్పష్టం అయింది అని అంటున్నారు. పాక్ జోక్యం పూర్తిగా ఉంది అన్న ఆధారాలు కూడా భారత ఇంటలిజెన్స్ వర్గాలు సేకరించాయని చెబుతున్నారు. వాటిని అన్నింటినీ కూడా భారత్ విదేశీ రాయబారులకు పూర్తివా వివరించిందని చెబుతున్నారు.
రేపటి రోజున భారత్ పాకిస్థాన్ మీద ఏ రకమైన కఠిన చర్యలు చేపట్టినా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ఈ విధంగా భారత్ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పాకిస్థాన్ సైతం యుద్ధ సన్నాహాలలో ఉంది. భారత్ మూడ్ ని గమనిస్తోంది. దానికి అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది.
ఇక రెండు దేశాలూ అణు సామర్ధం కలిగినవే. యుద్ధమంటూ వస్తే అది సంప్రదాయ యుద్ధంగానే ఉండదు అని పాక్ తన దూకుడుతో అణు యుద్ధం దాకా పరిస్థితిని తెస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా భారత్ దే ఈ యుద్ధంలో పై చేయి అవుతుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే భారత్ పట్టుదల చూస్తూంటే పాక్ పీచమణచడం ఖాయంగా కనిపిస్తోంది.
