వాడకం అంటే మనోళ్లదే.. చాట్ జీపీటీ తెగ వాడేస్తున్నారట
చైనా తయారీ చేసిన ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు.
By: Tupaki Desk | 8 Jun 2025 11:30 AMవాడకమంటే అలా ఇలా కాదు. వాడకానికి కూడా తెలీనంత బాగా వాడేయటం మనోళ్లకే చెల్లు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ.. ఏదైనా అంశం మీద ఫోకస్ పెట్టినా.. దాని కారణంగా ప్రయోజనం ఉంటుందన్న విషయంపై క్లారిటీ వచ్చినా.. దాన్ని వినియోగించే విషయంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్న వారిలో భారతీయులు ముందున్న విషయాన్ని తాజాగా విడుదలైన రిపోర్టు వెల్లడించింది.
2022 నవంబరు 30న చాట్ జీపీటీ ప్రపంచానికి పరిచయమైంది. అతి తక్కువ వ్యవధిలోనే దీన్ని వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. చాట్ జీపీటీ వినియోగంలో భారత యూజర్లు 13.5 శాతం ఉన్నట్లుగా గుర్తించారు. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి సైతం భారత్ ముందు ఉండటం విశేషం. చాట్ జీపీటీ వినియోగదారుల సంఖ్య భారత్ లో 10.8 కోట్లకు చేరుకున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాట్ జీపీటీ వినియోగంలో భారత యూజర్లు 13.5 శాతం ఉంటే.. అమెరికా వాటా 8.9 శాతమే. ఇండోనేషియా 5.7 శాతం.. బ్రెజిల్ 5.4.. ఈజిప్టు 3.9.. మెక్సికో 3.5..పాకిస్తాన్ 3..జర్మనీ 3.. ఫ్రాన్స్ 2.9..వియత్నాం 2.6 శాతాలతో ఉన్నాయి.
అవసరం ఏదైనా చాట్ జీపీటీని వాడేస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైనా తయారీ చేసిన ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వినియోగదారుల్లో డీప్ సీక్ ను వినియోగించే వారు 6.9 శాతం మనోళ్లే. 33.9 శాతం వాటాతో చైనా ముందు ఉంటే.. 9.2 శాతంతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. డీప్ సీక్ మొత్తం వినియోగదారులు 5.4 కోట్లు. ఇక.. చాట్ జీపీటీ తెలుగు.. హిందీ.. మలయాళం.. తమిళం వంటి భారతీయ భాషల్ని సపోర్టు చేస్తుంది. దీంతో.. తెలుగును వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ధరల్లో ఉండటం.. ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉండటం కూడా చాట్ జీపీటీ వాడకం ఎక్కువగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు. చాట్ జీపీటీ వేదికగా రోజుకు నమోదవుతున్న సెర్చ్ లు ఎన్నో తెలుసా? అక్షరాల 100 కోట్లకు పైనే. వార్షిక సెర్చస్ (వెతకటం) 36,500 కోట్లకు చేరుకోవటానికి గూగుల్ కు 11 ఏళ్ల సమయం తీసుకుంటే.. చాట్ జీపీటీ ఈ మైలురాయిని కేవలం రెండేళ్లలో అందుకోవటం గమనార్హం.
చాట్ జీపీటీకి అంతర్జాతీయంగా 80 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని.. 21 నెలల క్రితంతో పోలిస్తే చాట్ జీపీటీ యాప్ లో మూడు రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు వెచ్చిస్తున్నట్లుగా గుర్తించారు. చాట్ జీపీటీ డబ్బులు చెల్లించే చందాదారుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పెయిడ్ సబ్ స్రైబర్ల సంఖ్య 2 కోట్లకు చేరింది. చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐకు ప్రస్తుతం చందాదారుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది. చాట్ బాట్ ఒక్కటే కంపెనీకి ఏటా రూ.31,709 కోట్ల ఆదాయాన్ని అందించటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.