రిపోర్టు.. బిలియనీర్ల హబ్ గా భారత్
భారతదేశం తన రూపురేఖల్ని మార్చుకుంటోంది. పేద దేశంగా.. డెవలప్ అవుతున్న దేశమన్న దశ నుంచి.. తనను తాను మార్చుకుంటూ దూసుకెళుతోంది.
By: Tupaki Desk | 24 April 2026 12:37 PM ISTభారతదేశం తన రూపురేఖల్ని మార్చుకుంటోంది. పేద దేశంగా.. డెవలప్ అవుతున్న దేశమన్న దశ నుంచి.. తనను తాను మార్చుకుంటూ దూసుకెళుతోంది. భారత్ లో బిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో పెరిగిన బిలియనీర్లు మాత్రమే కాదు రానున్న ఐదేళ్లలోనూ అంతకు మించిన దూకుడు నమోదవుతుందన్న అంచనాల్ని వ్యక్తం చేస్తోంది నైట్ ఫ్రాంక్ అధ్యయనం. భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ప్రస్తుతం భారత్ లో 207 మంది బిలియనీర్లు ఉంటే.. 2031 నాటికి అంటే మరో ఐదేళ్లకు 51 శాతం పెరిగి 313కు చేరుకుంటుందని నైట్ ఫ్రాంక్ తన తాజా అధ్యయనంలో అంచనా వేసింది. అంతేకాదు అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ ఎన్ఐలు) 19,877 ఉంటే.. ఐదేళ్లలో వీరి సంఖ్య 25,217కు పెరుగుతుందని అంచనా వేసింది. ఇక్కడే ఒక డౌట్ రావొచ్చు. ఇంతకూ బిలియనీర్లను ఎలా లెక్కిస్తారు? అని. బిలియన్ డాలర్లు అంతకు మించిన సంపద ఉన్న వారిని బిలియనీర్లుగా చెబుతారు. అదే 30 మిలియన్ డాలర్లు.. అంతకు మించిన ఆస్తులు ఉన్న వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సరళంగా తెలుగులో వాడుక భాషలో చెప్పాలంటే.. అత్యంత ధనవంతులుగా వీరిని చెప్పొచ్చు.
బిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో రూ.9,425 కోట్లు. ఇటీవల కాలంలో డాలరుతో భారత రూపాయి మారకం విలువ పడిపోవటంతో ఈ మొత్తంలో మార్పు వచ్చింది. ఇక.. అత్యంత ధనవంతులుగా పేర్కొనే 30 మిలియన్ డాలర్లను మన రూపాయిల్లో చెబితే రూ.282 కోట్లుగా చెబుతారు. మన దేశంలో అత్యంత ధనవంతులు భారీగా ఉండటం తెలిసిందే.
నైట్ ఫ్రాంక్ తన 20వ ఎడిషన్ ద వెల్త్ రిపోర్టు 2026లో ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. అంతర్జాతీయంగా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నా.. వడ్డీ రేట్లు పెరుగుతున్నా.. అసమాన ఆర్తిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్నప్పటికి సంపద క్రియేషన్ అంతకంతకూ పెరుగుతున్నట్లుగా వెల్లడించింది. మన దేశానికి వస్తే టెక్నాలజీ.. ఇండ్రస్టియల్స్..క్యాపిటల్ మార్కెట్రంగాల్లో అసాధారణ స్థాయిలో సంపద క్రియేట్ అవుతున్నట్లుగా వెల్లడించింది. దేశంలో అత్యంత సంపన్నులున్న మహానగరంగా ముంబయి నిలిచింది.
అత్యంత ధనవంతుల జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలవటం గమనార్హం. ఇక.. బిలియనీర్ల విషయానికి వస్తే గడిచిన ఐదేళ్లలో 58 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అమెరికాలో 914 మంది ఉంటే.. చైనాలో 485 మంది ఉన్నారని.. భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. భారత్ తనను తాను మార్చుకుంటున్న విషయం రక్షణ విదేశాంగ రంగంలోనే కాదు.. సంపదలోనూ ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు వెల్లడించింది.
