అంతర్జాతీయ సెగలు.. ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By: Tupaki Desk | 18 March 2026 11:21 PM ISTపశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే పలు కీలక పథకాలకు ఆమోద ముద్ర వేసింది. ఒకవైపు జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని వణికిస్తుంటే, మరోవైపు దేశాభివృద్ధి దిశగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. యుద్ధాల నేపథ్యంలో భారత్ ను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ పథకానికి ఆమోద ముద్ర వేస్తూ కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
గత రెండు వారాలుగా పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్దం చేస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్‌ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇదే సమయంలో అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్‌గా ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తూ ప్రతిఘటిస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం ‘‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’’ పేరుతో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా, దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ. 33,660 కోట్లతో 'భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన' పథకాన్ని ప్రకటించింది. దీని వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 పెద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా 2.0లో భాగంగా దేశంలో తయారైన వస్తువులను ప్రపంచ విపణికి చేర్చడమే ఈ పథకం అసలు ఉద్దేశంగా వాణిజ్యశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఒక విస్తృత రూపమని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో వ్యవసాయం, రవాణా రంగానికి గణనీయమైన నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 2023-24లో పత్తి సీజన్ కనీస మద్దతు ధర (MSP) రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 11,712 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎన్.హెచ్-92లో బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీనిద్వారా నేషనల్ హైవేల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిపై కేంద్రం దృష్టి సారించిందని వెల్లడించారు. చిన్న జల విద్యుత్ పథకంపై దృష్టి పెట్టామని దీని కోసం రూ. 2,585 కోట్లు కేటాయించినట్లు వివరించారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్న సమయంలో, భారత్ తన దేశీయ అవసరాలను గుర్తించి పారిశ్రామిక, ఇంధన రంగాల్లో స్వయం ప్రతిపత్తి కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని అంటున్నారు. ఈ పథకాల ద్వారా అటు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
