Begin typing your search above and press return to search.

ఇంట్లోనే మృతదేహం.. ప్రశ్నిస్తే ఆగ్రహం..

స్థానికుల సమాచారం ప్రకారం.. ఆ కుటుంబం ఎవరితోనూ కలవకుండా, భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తోందని తెలుస్తోంది. మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2026 11:07 AM IST
ఇంట్లోనే మృతదేహం.. ప్రశ్నిస్తే ఆగ్రహం..
X

సమాజాన్ని ఆలోచనలో పడేసిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగింది. నాలుగు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, ‘మేము ప్రార్థనలు చేస్తున్నాం.. అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం’ అంటూ పొరుగువారిని తిప్పికొట్టిన ఓ కుటుంబం ప్రవర్తన ఆందోళన కలిగించింది.

నాలుగు రోజుల క్రితం మరణించిన శైలజ..

ఏపీలోని ఏలూరు, కైకలూరుకు చెందిన ఏసురత్నం కుటుంబం దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. ఆయన ఏఎస్ఐగా పనిచేసి పదేళ్ల క్రితం మరణించారు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, ఇద్దరు కుమార్తెలు సునీత, శైలజ (46), కుమారుడు జయరాజ్ కలిసి కూకట్‌పల్లి రామకృష్ణానగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ముగ్గురు పిల్లలకూ వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న శైలజ 13వ తేదీ చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి, శవాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తలుపులు మూసుకున్నారు. మొదట్లో ఇది కుటుంబం ఎదుర్కొంటున్న వ్యక్తిగత విషాదంగా భావించిన పొరుగువారు, రోజులు గడుస్తున్నా అంత్యక్రియలు జరగకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

పొరుగువారు, పోలీసులపై ఆగ్రహం

‘మేము ప్రార్థనలు చేసుకుంటున్నాం.. మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం’ అంటూ ప్రశ్నించినవారిపై ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా ఇంటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. చివరకు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది. పోలీసులు వచ్చి తలుపులు తీయమంటే కుటుంబం నిరాకరించడం గమనార్హం. ‘అడగడానికి మీరెవరు?’ అనే ప్రశ్నతో పోలీసులకే ప్రతిస్పందించడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. చివరికి జీహెచ్‌ఎంసీ జోక్యం ఉంటుందని హెచ్చరించడంతో కుటుంబం దిగొచ్చింది. పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని సొంతూరుకు తరలించారు.

ఈ ఘటనలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వ్యక్తిగత విశ్వాసాలు, మతపరమైన ఆచారాలు. మరొకటి సమాజానికి ఉండే బాధ్యత. మృతదేహాన్ని ఎక్కువకాలం ఇంట్లో ఉంచడం ప్రజారోగ్య పరంగా ప్రమాదకరం. అపార్ట్‌మెంట్ జీవనంలో ఇది మరింత సున్నితమైన విషయం. పొరుగువారికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు.. సామాజిక బాధ్యతగా మారుతుంది.

భిన్నమైన కుటుంబం

స్థానికుల సమాచారం ప్రకారం.. ఆ కుటుంబం ఎవరితోనూ కలవకుండా, భిన్నమైన జీవనశైలిని అనుసరిస్తోందని తెలుస్తోంది. మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో మానసిక ఆరోగ్య సహాయం, కౌన్సెలింగ్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నగరాల్లో ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో, కుటుంబాలు తమలోతమై మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి.

సమాజం ఆలోచించాలి..

ఇక మరో ప్రశ్న మన సమాజం ఇలాంటి సంఘటనల్ని ఎలా చూడాలి? కేవలం విచిత్రంగానా, తీవ్రంగా తీసుకోవాలా? లేక మానసిక ఆరోగ్యం, సామాజిక అనుబంధాలపై చర్చకు దారితీయాలా? పొరుగువారిగా మన బాధ్యత ఎక్కడ వరకు? అధికారుల జోక్యం ఎప్పుడు అవసరం? అని ఈ ఘటన మనకు గుర్తుచేస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు ఉంటాయి. అది ఇతరుల ఆరోగ్యం, భద్రతను ప్రభావితం చేస్తే, సమాజం స్పందించాల్సిందే. అదే సమయంలో, మానసిక సమస్యలు, కుటుంబాల ఒంటరితనం వంటి అంశాలను సున్నితంగా చూడాల్సిన అవసరం ఉంది.

కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఘటన ఒక కుటుంబం విషాదంతో పాటు, నగర జీవనంలోని లోతైన ప్రశ్నలను ముందుకు తెచ్చింది. మనం అందరం ఆలోచించాల్సిన సమయం ఇది. మన మధ్య నివసిస్తున్నవారి బాధలను గమనిస్తున్నామా? లేక కేవలం తలుపులు మూసుకున్న జీవనంలో మునిగిపోతున్నామా?