Begin typing your search above and press return to search.

రివైండ్: జపాన్ పై అణుదాడికి ముందు అమెరికా ఏం చేసింది?

పూర్తిగా నాశనం చేస్తాం.. తుడిచిపెట్టేస్తాం.. లాంటి మాటలు యుద్ధం వేళ.. అందునా అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రావటం సాధారణంగా తీసుకోలేం.

By:  Tupaki Desk   |   20 March 2026 10:20 AM IST
రివైండ్: జపాన్ పై అణుదాడికి ముందు అమెరికా ఏం చేసింది?
X

పూర్తిగా నాశనం చేస్తాం.. తుడిచిపెట్టేస్తాం.. లాంటి మాటలు యుద్ధం వేళ.. అందునా అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రావటం సాధారణంగా తీసుకోలేం. అందునా ట్రంప్ లాంటి దుందుడుకు అధినేత వ్యాఖ్యల్ని సింఫుల్ గా తీసిపారేయటం సాధ్యమయ్యేది కాదు. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అనూహ్య రీతిలో ఇరాన్ చేస్తున్న దాడులు.. అమెరికా మిత్రపక్షాల ఆయిల్ సామర్థ్యాల మీదా.. కర్మాగారాల మీద జరుపుతున్న దాడులు ఇప్పుడు కొత్త భయాలకు కారణంగా మారుతున్నాయని చెప్పాలి.

ఇలాంటి వేళలోనే అణు దాడులకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అణు యుద్దాలకు తావు లేదు. అణు దాడులకు పాల్పడే అవకాశాలు తక్కువే. ఎందుకంటే.. ఇరాన్ ను అమెరికా టార్గెట్ చేసి అణు దాడులకు పాల్పడితే.. నష్టం ఇరాన్ కు మాత్రమే పరిమితం కాదు. దాని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు ఆ వినాసన తీవ్రతను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ద సమయంలో రెండో ప్రపంచ యుద్దంలో జపాన్ పై అమెరికా ప్రయోగించిన రెండు అణు బాంబుల (లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్) తీవ్రత ప్రపంచానికి తెలిసిందే. ఈ రెండు అణు బాంబుల ధాటికి ఏకంగా 1.50లక్షల మంవి జపనీయులు చనిపోవటం అత్యంత బాధాకరం. అంతేకాదు.. ఈ అణుదాడుల తర్వాత లక్షలాది మంది ప్రత్యక్షంగానే.. పరోక్షంగానూ బాధితులుగా మారటం.. వేలాది మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అప్పటివరకు ప్రపంచానికి పరిచయం లేని అణు బాంబుల దాడి వేళ.. అమెరికా ఎలా వ్యవహరించింది. తాను తీవ్రంగా వినాశనం చేసే బాంబుల్ని ప్రయోగిస్తున్న వివరాల్ని ముందస్తుగా వెల్లడించిందా? లేదా? అన్న వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర వివరాలు వెల్లడవుతాయి. జపాన్ పై ప్రయోగించిన రెండు అణు బాంబుల్లో మొదటిది లిటిల్ బాయ్ పేరుతో ఉన్న మొదటి అణు బాంబును 1945 ఆగస్టు 6న హిరోషిమా నగరంపై ప్రయోగించారు. మూడు రోజుల తర్వాత 1945 ఆగస్టు తొమ్మిదిన ఫ్యాట్ మ్యాన్ పేరుతో ఉన్న రెండో అణు బాంబ్ ను నాగసాకి నగరంపై ప్రయోగించారు.

ఈ అణు బాంబుల ప్రయోగానికి కొద్ది రోజుల ముందు అమెరికా.. దాని మిత్రపక్షాలు ఏమైనా హెచ్చరికలు జారీ చేశాయా? అంటే.. అవుననే చెప్పాలి. నేరుగా అణు దాడులకు దిగుతామని నేరుగా చెప్పలేదు కానీ.. తీవ్ర వినాశనం తప్పదన్న సంకేతాల్ని మాత్రం ఇచ్చిందని చెప్పాలి. 1945 జులై 26న బ్రిటన్, చైనా కలిపి జపాన్ కు ఒక అల్టిమేటం జారీ చేశాయి. దీన్ని పోట్స్ డ్యామ్ డిక్లరేషన్ గా వ్యవహరిస్తారు. జపాన్ ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోవాలని కోరారు. ఒకవేళ జపాన్ లొంగిపోకుంటే తక్షణ.. సంపూర్ణ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు. అయితే.. ఈ ప్రకటనలో ఎక్కడా అణు బాంబ్ అనే పదాన్ని వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే.. అమెరికా సైన్యం మాత్రం అణుదాడికి కొద్ది రోజులు ముందు నుంచి తమ విమానాల ద్వారా లక్షలాది హెచ్చరిక పత్రాల్ని జారవిడిచారు. హిరోషిమాపై బాంబు వేయానికి ముందు సుమారు 33 జపాన్ నగరాలపై ఈ పత్రాల్ని విడిచి పెట్టారు. వీటిల్లో తమ సైన్యం కొన్ని నగరాల్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. తమ సైన్యం చేసే వినాశనానికి ముందే పైరులు తమ ప్రాంతాల్ని ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

దీన్ని మైండ్ గేమ్ గా భావించిన జపాన్ అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. జపనీయులు సైతం ఇంతటి రక్తపాతంతో పాటు.. ప్రాణాలు పోయేంత దవినాశకర బాంబులు వేస్తారని ఊహించలేదు. హిరోషిమాలో అణు బాంబు విడిచి పెట్టిన తర్వాత.. నాగసాకి మీద రెండో బాంబు వేయటానికి ముందు అమెరికా సైన్యం మరిన్ని పత్రాల్ని జార విడిచాయి.అందులో తమ వద్ద అత్యంత శక్తివంతమైన కొత్త ఆయుధం ఉందని.. హిరోషిమాలో ఏం జరిగిందో తెలుసుకోండి అంటూ హెచ్చరిస్తూ.. జపాన్ లొంగిపోవాలంటూ కోరారు. కానీ.. ఆ హెచ్చరికల తీవ్రతను మైండ్ గేమ్ గా భావించిన జపాన్ ప్రభుత్వం.. అందుకు ప్రతిగా తన దేశ పౌరుల్ని ఒకేసారి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.