Begin typing your search above and press return to search.

‘పరువు' అంటే కన్నపిల్లల ప్రాణాలు తీసేంతటి క్రూరత్వమా?

ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి పరువు హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   13 Jun 2026 1:37 PM IST
‘పరువు అంటే కన్నపిల్లల ప్రాణాలు తీసేంతటి క్రూరత్వమా?
X

ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి పరువు హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాల్సిన యువతిని సొంత కుటుంబ సభ్యులే హతమార్చారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ సంఘటన కన్నప్రేమకే మచ్చగా నిలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు. కూతురు తమ మాట వినలేదనే కోపంతో ప్రాణం తీసేటంతటి ఘోరం చేయడానికి తల్లి ఇతర కుటుంబ సభ్యులు వెనుకాడకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా యువతి వేరొకరిని వివాహం చేసుకోడానికి ప్రయత్నించడం, అదే జరిగితే ‘పరువు’ పోతుందన్న ఆలోచనే ఈ ఘోరానికి దారితీసినట్లు భావిస్తున్నారు. అయితే సమాజంలో మంచి పేరు సంపాదించడం ద్వారా పరువు పెరుగుతుందని భావించాల్సిన వారు... పిల్లల నిర్ణయాలను అణచివేయడం, వారి ప్రాణాలు తీయడం ద్వారానే గౌరవం దక్కుతుందనే సంకుచిత భావనతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని అంటున్నారు. 'పరువు' అనే ఆలోచనే చివరకు కన్నవారిని హంతకులుగా మార్చి కారాగారానికి నెట్టేస్తోందని చెబుతున్నారు.

కన్నవారిలో చైతన్యం రావాలి

తమ పిల్లలు భిన్నమైన ఆలోచనలు చేసినప్పుడో లేదా తమకు నచ్చిన భాగస్వామిని ఎన్నుకున్నప్పుడో, దాన్ని పెద్దలు తమ కులానికి, మతానికి జరిగిన అవమానంగా భావిస్తారు. ఇక్కడే తల్లిదండ్రులు ఒక విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు మీ రక్తమే కావచ్చు, కానీ వారు మీ ఆస్తి కాదన్న విషయాన్ని గుర్తించాలి. పిల్లలకి ఒక స్వతంత్ర జీవితం, సొంత ఆలోచనలు ఉంటాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. చదువుకున్న పిల్లల నిర్ణయాలను గౌరవించాల్సింది పోయి, వాటిని తిరుగుబాటుగా చూడటం తప్పు అంటున్నారు నిపుణులు.

పిల్లల నిర్ణయం నచ్చనప్పుడు వారితో కూర్చుని మాట్లాడాలి. నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అంతేకానీ బలవంతంగా నిర్బంధించడం, శారీరక హింసకు పాల్పడటం తీవ్రమైన నేరం అంటూ హెచ్చరిస్తున్నారు. నలుగురూ ఏమనుకుంటారు? అనే ఒకే ఒక్క భయంతో కన్నపేగును తెంచుకున్న పిల్లల రక్తంతో చేతులు కడుక్కోవడం ఏ రకమైన న్యాయం? సమాజం రేపు మీ కష్టాల్లో తోడుండదు, కానీ పిల్లలు మీ భవిష్యత్తు అనే నిజాన్ని కన్నవారు గుర్తించాలని అంటున్నారు.

జైలుకు వెళ్తే పరువు నిలుస్తుందా?

కన్నపిల్లలను చంపి, గుండెపోటు లేదా ఆత్మహత్యగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకోవడం మూర్ఖత్వం. శ్రీకాకుళం కేసులో సాంకేతికత (యాప్స్, సెల్ఫీ వీడియోలు)తో అసలు విషయం బయటపడిందని అంటున్నారు. పిల్లలు మా మాట వినలేదు, అందుకే లేపేసామని కుల పెద్దల ముందు కాలర్ ఎగరేయడం పరువు కాదని, ఒక క్రిమినల్ నేరం చేసి, హంతకులుగా ముద్రపడి, కోర్టుల చుట్టూ తిరుగుతూ, జీవితాంతం జైలు కటకటాల వెనుక గడపడం సమాజంలో అత్యంత అవమానకరంగా భావించాలని అంటున్నారు.

ఒక తప్పుడు నిర్ణయం వల్ల కన్నపిల్లలు లోకాన్ని విడిచిపోతే, తల్లిదండ్రులు జైలు పాలవుతారు. ఇంట్లో మిగిలిన చిన్న పిల్లలు లేదా ఇతరులు సమాజంలో తలదించుకుని అనాథలుగా మిగిలిపోతారు. మీరు కోరుకునే 'పరువు' ఇలా ఉండాలా అంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ సామాజిక జాడ్యాన్ని రూపుమాపాలంటే చట్టాలతో పాటు సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పు రావాలని సూచిస్తున్నారు. పిల్లలు ఎదిగే కొద్దీ వారితో స్నేహితుల్లా మెలగాలని అంటున్నారు. పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలి. అంతేగానీ కట్టుబాట్ల పేరుతో దూరం పెంచితే వారు మరింత దూరం జరుగుతారని హెచ్చరిస్తున్నారు.