Begin typing your search above and press return to search.

హాంకాంగ్ మీడియా మొఘల్ కు 20 ఏళ్లు జైలు

ప్రభుత్వాల్ని ప్రశ్నించటం.. ప్రజల పక్షాన నిలవటం మీడియా ప్రధాన పాత్ర. అయితే.. తమకు లభించిన స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తే.. మరికొందరు తమ జీవితాల్ని సైతం ప్రజలకు ధారపోసేస్తుంటారు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 11:00 AM IST
హాంకాంగ్ మీడియా మొఘల్ కు 20 ఏళ్లు జైలు
X

ప్రభుత్వాల్ని ప్రశ్నించటం.. ప్రజల పక్షాన నిలవటం మీడియా ప్రధాన పాత్ర. అయితే.. తమకు లభించిన స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తే.. మరికొందరు తమ జీవితాల్ని సైతం ప్రజలకు ధారపోసేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పే ప్రముఖుడు రెండో వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న హాంకాంగ్ ప్రాంతంలో తిరుగులేని మీడియా అధినేతగా ఒక వెలుగు వెలిగిన మీడియా ప్రముఖుడికి తాజాగా 20 ఏళ్లు జైలుశిక్ష విదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలా అని ఆయన స్కాంలు.. సెక్సు కుంభకోణాల్లో పాలు పంచుకోలేదు.

నిజాన్ని నిజంగా చెప్పటం.. చైనా విధానాల్ని చీల్చి చెండాడి.. ప్రజల పక్షాన నిలిచేవాడు. ఆయనే.. హాంకాంగ్ మీడియా మొఘల్ గా చెప్పే యాపిల్ డైలీ పత్రిక యజమాని కం మీడియా అధినేత జిమ్మీ లాయ్. 78 ఏళ్ల వయసులో ఆయనకు ఇరవై ఏళ్ల జైలుశిక్ష విధించటం ద్వారా.. ప్రశ్నించే గొంతును అణిచేశారు. దీనికి ముందే ఆయన మీడియా సంస్థను మూసేశారు. 2021లో యాపిల్ డైలీ పత్రిక క్లోజ్ అయ్యేలా చేశారు.

ప్రభుత్వ విధానాల్ని ధైర్యంగా ప్రశ్నించే ఆయన్ను 2020లో రూపొందించిన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియా సంస్థలో పని చేసే పలువురు జర్నలిస్టులను జైలుపాలు చేశారు. దీంతో 2021లో ఈ మీడియా సంస్థ మూతపడింది. బ్రిటిష్ జాతీయుడైన ఆయన,. హాంకాంగ్ వాసిగా అక్కడి ప్రభుత్వాలు చెబుతాయి. దీనికి కారణం.. జైలుపాలు చేసిన నేపథ్యంలో.. బ్రిటన్.. అమెరికాలు ఆయన్ను విడిచి పెట్టాలని.. విదేశీయడైన ఆయన్ను వదిలేయాలనే వాదనను నీరుకార్చేందుకు వీలుగా ఆయన్ను హాంకాంగ్ వాసిగా చెప్పటం ద్వారా ఆయన్ను జైలు నుంచి బయటకు రాకుండా ఉండేలా చేయాలన్నది హాంకాంగ్ ను నియంత్రించే చైనా పాలకుల ఆలోచనగా చెప్పాలి.

ఇటీవల విస్తీర్ణం పెంచిన హైదరాబాద్ మహానగరాన్ని హాంకాంగ్ తో పోలిస్తే.. సగం కంటే తక్కువ విస్తీర్ణంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. హాంకాంగ్ ప్రత్యేకత ఏమంటే.. తనకున్న భూమిలో 75 శాతం అడువులు.. చెట్లకు కేటాయించి కేవలం 25 శాతం భూమిలోనే నగర నిర్మాణం జరిగేలాజాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిటన్ తో చైనాకు ఉన్న ఒప్పందాన్ని అనుసరించి.. హాంకాంగ్ 1997లో చైనాలో భాగం కావటం తెలిసిందే. ఈ ప్రక్రియ జరగటానికి రెండేళ్ల ముందే.. లాయ్ తన పత్రికను స్థాపించారు.

జిమ్మీ లాయ్ కు శిక్ష విధించటం తనకు బాధ కలిగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించటమే కాదు.. తాను చైనా అధినేతతో మాట్లాడానని.. శిక్షకు గురైన మీడియా ప్రముఖుడ్ని విడుదల చేయాల్సిందిగా కోరినట్లుగా పేర్కొన్నారు. తాజాగా విధించిన జైలుశిక్ష అమలు జరిగితే తన తండ్రి జీవితం జైల్లోనే ముగిసిపోతుందన్న ఆందోళనను లాయ్ కుమార్తె క్లెయిర్ పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించిన మీడియా ప్రముఖుడికి విధించిన శిక్షపై పలు విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేయగా.. చైనా, హాంకాంగ్ నాయకత్వాలు మాత్రం తమ చర్యను సమర్థించుకోవటం గమనార్హం.

విదేశీ శక్తులతో కుమ్మక్కై దేశద్రోహపూరిత వార్తాకథనాల్ని లాయ్ ప్రచురించారన్నది ఆయనపై ప్రధాన అభియోగం. ఆయనతో పాటు ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షను విధించటం గమనార్హం. లాయ్ జీవితాన్ని చూస్తే.. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని చెప్పాలి. జిమ్మీ లాయ్ కు చెందిన మీడియా సంస్థలు.. దాని స్థాయి గురించి చెప్పాల్సిన వస్తే.. బోలెడన్ని విశేషాలు కనిపిస్తాయి.

యాపిల్ డైలీ పేరుతో ఆయన దినపత్రికను ఏర్పాటు చేశారు. హాంకాంగ్ లో అత్యంత శక్తివంతమైన.. అతి పెద్ద మీడియా సామ్రాజ్యాల్లో ఒకటిగా చెప్పాలి. హాంకాంగ్ లో రెండో అతి పెద్ద వార్తాపత్రికగా యాపిల్ డైలీ ఉండేది. 2021లో పత్రికను మూసి వేసే సమయానికి రోజుకు సరాసరిన 80వేల కాపీల సర్క్యులేషన్ ఉండేది. అయితే.. ఈ పత్రిక చివరి రోజున మాత్రం ఏకంగా 10 లక్షల ప్రతుల్ని ప్రింట్ చేయగా.. నిమిషాల వ్యవధిలో అమ్ముడయ్యాయి. చివరి రోజు ఎడిషన్ కోసం ప్రజలు క్యూలో బారులు తీరి మరీ కొనుగోలు చేయటం గమనార్హం.

ఇక.. ఈ మీడియా సంస్థకు చెందిన వెబ్ సైట్ ట్రాఫిక్ విషయానికి వస్తే నెలకు 9.6 మిలియన్ విజిటర్స్ ఉండేవారు. 2020 నాటికి ఈ సంస్థలో దాదాపు రెండు వేలకు పైనే ఉద్యోగులు పని చేసేవారు. ఈ మీడియా సంస్థ మాతృసంస్థగా ‘‘నెక్స్ట్ డిజిటల్’’ చెప్పాలి. దీని ఆదాయం 2020 మార్చి నాటికి మన రూపాయిల్లో దాదాపు రూ.1200 కోట్లుగా చెప్పాలి. హాంకాంగ్ మాత్రమే కాదు తైవాన్ లోనూ ఈ మీడియా సంస్థ కార్యకలాపాలు ఉండేవి. వ్యాపార సంస్థగా కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకగా.. ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా ఈ మీడియా సంస్థ చెరగని ముద్రను వేసింది. ప్రజల కోసం.. ప్రజల తరఫున.. ప్రజల బాగోగులు.. వారి ప్రజాస్వామ్యం కోసం తన మీడియా సంస్థ ద్వారా పోరాడిన వ్యక్తి ఈ రోజున 78 ఏళ్ల వయసులో 20 ఏళ్ల జైలుశిక్షను ఎదుర్కోవాల్సిన దుస్థితి.