Begin typing your search above and press return to search.

ఏపీలో హిందూత్వ పోలరైజేషన్ ?

ఏపీ అంటేనే మొదటి నుంచి సెక్యులర్ భావాలతో ముందుకు సాగుతున్న రాష్ట్రం. దానికి నేపధ్యం కూడా గట్టిగా ఉంది.

By:  Satya P   |   8 July 2026 9:07 AM IST
ఏపీలో హిందూత్వ పోలరైజేషన్ ?
X

ఏపీ అంటేనే మొదటి నుంచి సెక్యులర్ భావాలతో ముందుకు సాగుతున్న రాష్ట్రం. దానికి నేపధ్యం కూడా గట్టిగా ఉంది. తెలంగాణాకు ఏపీకి ఇక్కడే వైవిధ్యం కూడా ఉంది. ఏపీ ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటూ వచ్చింది. అక్కడ ద్రవిడ భావజాలం అధికం అన్నది తెలిసిందే. దాంతో పాటు అందరూ సమానమే అన్న మరో భావన ఎక్కువగా ఉంది. ప్రశ్నించడం హేతు బద్ధంగా తర్కంగా ఆలోచనలు చేయడం వంటివి సహజంగానే ఏపీలోనూ విస్తరించాయి. జస్టిస్ పార్టీ అక్కడ పుట్టినా ఏపీలోనూ దాని భావజాలాన్ని వ్యాప్తి చేసిన వారు ఉన్నారు. ఇలా ఏపీ అయితే మొదటి నుంచి సెక్యులర్ ఐడియాలజీతోనే ముందుకు సాగింది. అదే రాజకీయాల్లో ప్రతిఫలించింది. ఉమ్మడి ఏపీగా ఉన్న చాలా కాలం పాటు వామపక్షాలు రాజకీయంగా ప్రభావం చూపించి ప్రతిపక్ష పాత్రలో ధీటుగా నిలిచిన సందర్భం ఉంది. ఒకానొక దశలో అధికారంలోకి కూడా వచ్చేంతగా వాటి ఊపు కనిపించింది.

బీజేపీ సైతం అక్కడే :

ఏపీలో బీజేపీ ఎదగలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. జనసంఘ్ కాలం నాటి నుంచి ఎంతో మంది ఉద్ద్ధండులు అయిన నాయకులు ఉన్నప్పటికీ ఏపీలో సొంతంగా బీజేపీ వికసించలేకపోయింది. పొత్తుల వల్లనే ఎపుడూ సీట్లు సాధిస్తూ వచ్చింది. ఏపీలో హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతగానో ప్రయత్నాలు జరిగినా అవి పెద్దగా ఫలించలేదు. ఇక ఇపుడు ఏపీలో చూస్తే మళ్ళీ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. 2024 మధ్యలో తిరుపతి లడ్డూ కల్తీ అంటూ జరిగిన ఆందోళనలు కూడా కొంత అలజడిని రేపినా ఏపీలో మాత్రం అనుకున్న స్థాయిలో అయితే అవి ప్రతిఫలించలేదు. ఇక లేటెస్టుగా చూస్తే జరుగుతున్న కొన్ని ఉదంతాలు మళ్ళీ ఏపీలో హిందూత్వ మీద చర్చ జరిగేలా చేస్తున్నాయి.

ఆయన అరెస్టు తోనే :

ఇటీవల ఒక యూ ట్యూబర్ ని అరెస్టు చేశారు. ఆయన మీద ఉపా కేసు ఫైల్ చేశారు. అది దేశ ద్రోహానికి పాల్పడిన వారి మీద పెట్టే కేసు. ఇక హిందూ దేవుళ్ళను ఆయన నిందించారు అని ఒక సెక్షన్ నుంచి గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొందరు యూ ట్యూబర్ అరెస్టుని తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నారు. జగన్ సైతం ట్వీట్ చేశారు. దీంతో టీడీపీ నేతలు దాని మీద గట్టిగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ దేశాన్ని హిందూ మతాన్ని అవమానించిన వారిని వెనకేసుకొస్తున్నారని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సమంజసమేనా అని ప్రశ్నించారు.

సాధు పరిషత్ మండిపాటు :

అదే సమయంలో హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఏపీ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. కొందరు వ్యక్తులు హిందువులపై నిరంతరం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందూ ఆరాధ్య దైవాలను అవమానించేలా మాట్లాడుతున్నారని అయితే హిందూ వ్యతిరేక శక్తులందరికీ వైసీపీ న్యాయ సహాయం చేస్తోందని ఆయన విమర్శించారు.

నెట్టింట భీకర వార్ :

అంతే కాదు సోషల్ మీడియాలో చూస్తే యూ ట్యూబర్ అరెస్టు మీద తీవ్ర స్థాయిలో వార్ జరుగుతోంది. అనుకూల ప్రతికూల వాదనలతో నెట్టింట రచ్చ సాగుతోంది. హిందూ దేవీ దేవతల పట్ల అపచారం చేస్తున్న వారిని వెనకేసుకుని రావడమేంటి అని హిందూత్వవాదులు గట్టిగానే స్వరం పెంచుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. బీజేపీ నేతలు అయితే దీని మీద పెద్దగా రియాక్ట్ కావడం లేదు కానీ వైసీపీని ఈ విషయంలో మిగిలిన ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. వారి విషయం అలా ఉంటే ఏపీలో హిందూత్వ వాదం పెరుగుతోందా అంటే నెట్టింట జోరు అలాగే కనిపిస్తోంది. ఒక వైపు ఏపీలో బహుజన వర్గీయుల సభలు సంఘీభావ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మరో వైపు చూస్తే వరస ఉదంతాలతో హిందూత్వ వాదాన్ని పెంచేందుకు అనుకూల వ్యక్తులు శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపధ్యం ఉంది. అయితే ఇది ఎంతవరకూ సాగుతాయన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఏపీ అయితే ఒక న్యూట్రల్ స్టాండ్ తోనే ఉంటోంది అన్నది చరిత్ర చెబుతోంది. అదే సమయంలో గతం కంటే పెరిగిన హిందూత్వ చైతన్యం పోలరైజ్ అయ్యే విధంగా సాగుతుందా అన్నదే చర్చగా ఉంది.