Begin typing your search above and press return to search.

జగన్...బాబు... పవన్ : ఏపీని చుట్టిన వీరుడు ఎవరు ?

ఇదిలా ఉంటే ఈ అయిదేళ్ళూ ఏపీలో హై ఓల్టేజ్ పాలిటిక్స్ సాగాయని చెప్పక తప్పదు.

By:  Tupaki Desk   |   8 May 2024 1:49 PM GMT
జగన్...బాబు... పవన్ : ఏపీని చుట్టిన వీరుడు ఎవరు ?
X

ఏపీలో అయిదేళ్ళ తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 23 సీట్లకే టీడీపీ పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామని బరిలోకి దిగిన జనసేన 1 సీటు తెచ్చుకోగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఇదిలా ఉంటే ఈ అయిదేళ్ళూ ఏపీలో హై ఓల్టేజ్ పాలిటిక్స్ సాగాయని చెప్పక తప్పదు.

జగన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం విపక్షాలు యుద్ధాన్నే ప్రకటించాయి. అలా అలుపెరగని పోరాటం చేశాయి. మధ్యలో రెండేళ్ల పాటు కరోనా వచ్చినా సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఆన్ లైన్ వార్ ని నడిపించాయి. ఇవన్నీ పక్కన పెడితే నికార్సుగా ఏపీలో ఉన్న మూడేళ్ల కాలంలో ఎవరు ఎక్కువగా జనాలలో తిరిగారు అంటే కనుక పెద్దగా లెక్కలతొ పని లేకుండా చెప్పాల్సింది చంద్రబాబు అని.

కరోనా 2020 మార్చిలో దేశంలోకి వచ్చింది. అప్పటివరకూ ఏదో ఒక నిరసన ప్రోగ్రాం అంటూ చంద్రబాబు జనంలో ఉన్నారు. అంటే తొలి ఏడాది పది నెలల పాటు బాబు విపక్ష నేత హోదాలో కలియతిరిగారు అన్న మాట. ఇక కరోనా తగ్గిన తరువాత 2022 నుంచి 2024 ఎన్నికల ప్రచారం వరకూ చంద్రబాబు మరింత అగ్రెసివ్ మోడ్ లో తిరిగారు. ఈ మధ్యలోనే బాదుడే బాదుడు అని ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అని చాలా ప్రోగ్రామ్స్ అని ఆయన కండక్ట్ చేశారు.

వివిధ రకాలైన పేర్లు తన యాత్రలకు పెట్టి మరీ జనంలోకి వెళ్ళారు. ఇక ఎన్నికల వేళ ప్రజా గళంతో ఆయన ఏపీని ఒకటిని మూడు సార్లు గా చుట్టేస్తున్నారు. చంద్రబాబు తరువాత ఎక్కువగా తిరిగింది ఆయన పార్టీలో నారా లోకేష్. ఆయన ఏకంగా యువగళం పాదయాత్రతో ఏపీని చుట్టేశారు. అలాగే శంఖారావం సభలు నిర్వహించారు. ఇపుడు ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు.

ఇక ఏపీ సీఎం జగన్ కరోనా అనంతరం అంటే 2022 నుంచి 2024 వరకూ రెండేళ్ల పాటు జనంలో ఉంటూ వచ్చారు. ఆయన సంక్షేమ పధకాలకు సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమాన్ని జనం మధ్యలో చేస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ అలా ఏపీలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ వచ్చారు. అలా జగన్ సభలు ప్రతీ నెలలో ఒకటి లేదా రెండు ఉండేలా చూసుకున్నారు. ఎన్నికలు దగ్గర చేసి ఆయన సిద్ధం పేరుతో రీజనల్ మీటింగ్స్ అలాగే మేమంతా సిద్ధం పేరుతో ఏపీ అంతా బస్సు యాత్ర ద్వారా తిరిగారు. ఇక ఆయన దాదాపుగా అన్ని జిల్లాలలో ఎన్నికల సభలు నిర్వహించారు. ఇపుడు రోజుకు మూడు వంతున సభలతో హోరెత్తిస్తున్నారు.

ఈ విధంగా చూసుకుంటే కనుక జగన్ కూడా జనంలో ఉంటూ సభలు నిర్వహించారు. ఇక జనసేన అధినేత పవన్ అయితే 2019లో జగన్ అధికారంలోకి రాగానే నిర్వహించిన తొలి సభ విశాఖలోనే సాగింది. ఆయన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ సభ నిర్వహించారు. ఆ తరువాత అడపా తడపా సభలు నిర్వహిస్తూ 2022 జూన్ నాటికి వారాహితో దూకుడు పెంచేశారు. ఏకంగా జనంలోనే పవన్ ఉంటూ వచ్చారు.

ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ఆయన సోలోగా ప్రచారాలు చేస్తున్నారు. కూటమి సభలలో పాలు పంచుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎక్కువగా ఎవరు జనాలలో తిరిగారు అంటే చంద్రబాబుదే మొదటి ప్లేస్ అని ఒక అంచనా గా చెబుతున్నారు అంతా. ఆయన జనంలో ఉన్నన్ని రోజులు మరే నేతా లేరు అని అంటున్నారు. ఆయన తరువాత స్థానం జగన్ ని వెళ్తుంది. ఇక మూడవ ప్లేస్ లో పవన్ ఉన్నారు అని అంటున్నారు.

మరో విశ్లేషణ కూడా ఇక్కడ ఉంది. మొత్తం అయిదేళ్ళు అంటే 1875 రోజులలో చంద్రబాబు అత్యధిక కాలం జనంలోనే ఉండగా ఆ తరువాత ప్లేస్ లో జగన్ కనిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మూడవ స్థానంలో ఉన్నారు అన్నది ఒక విశ్లేషణ గా వస్తోంది. ఏది ఏమైనా పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఎపుడు వచ్చాం కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్.

నిరంతరం జనంలో ఉన్నా ఫలితాలు వచ్చే కాలం కాదిది. అలాగే జనాలతో ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుని అవసరం అయినప్పుడు తిరిగినా సరిపోతుంది అనుకునే రాజకీయానికి సక్సెస్ దొరుకుతోంది. సో ఏపీలో జనాలకు ఇవన్నీ తెలుసు. దాంతో వారు తమకు ఎవరు కనెక్ట్ అయ్యారు. ఎవరు ఏమిటి చేశారు అన్న దాని మీదనే అన్నీ ఆలోచించి మరి కొద్ది రోజులలో తీర్పు ఇవ్వబోతున్నారు అని అంటున్నారు.