Begin typing your search above and press return to search.

బిగ్ క్వశ్చన్... హీరో నిఖిల్ టీడీపీలో చేరినట్లా.. చేరనట్టా?

అవును... యంగ్ హీరో నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకంటే ముందు... కాస్త కన్ ఫ్యూజన్ సిట్యువేషన్ ని కూడా కలిగి ఉంది.

By:  Tupaki Desk   |   29 March 2024 8:24 PM GMT
బిగ్  క్వశ్చన్... హీరో నిఖిల్  టీడీపీలో చేరినట్లా.. చేరనట్టా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాల్లో సినీజనాల సందడి అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆయా రాజకీయాలకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నిఖిల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సందిగ్దతతో కూడిన చర్చనీయాంశం అయ్యింది.

అవును... యంగ్ హీరో నిఖిల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకంటే ముందు... కాస్త కన్ ఫ్యూజన్ సిట్యువేషన్ ని కూడా కలిగి ఉంది. ఇందులో భాగంగా.. "తెలుగుదేశం పార్టీ లో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్" అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ తో పాటు, నారా లోకేష్ ట్విట్టర్ అకౌంట్ లోనూ ప్రధానంగా పసుపు కండువాతో ఉన్న నిఖిల్ ఫోటోలను పోస్ట్ చేశారు!

అయితే.. ఇదే విషయాలపై తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించిన హీరో నిఖిల్... "టీడీపీ - బీజేపీ - జనసేన అలియన్స్ లో భాగంగా చీరాల ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకున్న తన మావయ్య ఎంఎం కొండయ్య యాదవ్ గారికి శుభాకాంక్షలు" అంటూ.. "ప్రజలకు సేవ చేయడానికి తమ కుటుంబానికి అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు" అని రాస్తూ.. లోకేష్ కి ఒక మొక్కని బహుకరిస్తున్న ఫోటోలను మాత్రమే పోస్ట్ చేశారు.

దీంతో... ఇంతకీ హీరో నిఖిల్ అధికారికంగా టీడీపీలో చేరారా.. లేదా అనే విషయంలో తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. టీడీపీ పోస్టులు చూస్తే మాత్రం పార్టీలో చేరినట్లు అనిపిస్తుండగా.. ఆ విషయాన్ని నిఖిల్ కన్ ఫాం చేయకపోవడం.. తన మావయ్యకు టిక్కెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికే లోకేష్ ని కలిసినట్లు అర్ధం వచ్చేలా స్పందించడంతో ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఏర్పడింది.

కాగా... 2019 ఎన్నికల సమయంలో కూడా హీరో నిఖిల్.. తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లాలోని డోన్, పత్తికొండతో పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించిన నిఖిల్.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు.

ఈ క్రమంలో ఏపీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని.. టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాయని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని.. ప్రజలంతా మంచిపనులు చేసే టీడీపీకి అండగా ఉండాలంటూ నిఖిల్ ప్రచారంలో భాగంగా ప్రజలను కోరారు!

ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపుకండువా కప్పుకుని చిరునవ్వులు చిందించారు.

ఇక "హ్యాపీడేస్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్... ప్రస్తుతం వరుస ఆఫర్లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన "కార్తికేయ - 2"తో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ అయిన అతడు.. ప్రస్తుతం "స్వయంభూ" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది!