Begin typing your search above and press return to search.

స్వీట్ వార్నింగ్... జనసేనకు వెస్ట్ లో ఈ సీట్లు ఇవ్వకపోతే జరిగేది ఇదే!

అయితే ఈ విషయంలో హరిరామ జోగయ్య మాత్రం పవన్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:39 AM GMT
స్వీట్ వార్నింగ్... జనసేనకు వెస్ట్ లో ఈ సీట్లు ఇవ్వకపోతే జరిగేది ఇదే!
X

ఇప్పుడు ఏపీలో జనసేనకు కేటాయించే సీట్లపై కాపు సామాజికవర్గంలో బలమైన చర్చ జరుగుతుందని తెలుస్తుంది! కనీసం 50 - 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ ఫర్ అవ్వదని ఆ సామాజికవర్గ శ్రేయోభిలాషులు చెబుతుండగా... చంద్రబాబు శ్రేయోభిలాషులు మాత్రం.. ఎన్ని ఇచ్చిన పర్లేదు కానీ అడిగిన చోట్ల ఇస్తే చాలన్నట్లుగా సన్నాయి నొక్కులు నొక్కు తున్నారని అంటున్నారు.


అయితే ఈ విషయంలో హరిరామ జోగయ్య మాత్రం పవన్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ సీట్ల సంఖ్య, నియోజకవర్గాల పేర్లతో పాటు ఏకంగా అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించే పనికి పూనుకున్నారని లేఖలు విడుదలైన నేపథ్యంలో... గత కొన్ని రోజులుగా చిన్న సైజు వార్నింగులు అటు టీడీపీ, ఇటు జనసేనకు ఇస్తున్నారు జోగయ్య. అవి సూచనలా.. హెచ్చరికలా అనేది చూసేవారి కోణన్ని బట్టి ఉంటుందని అనుకున్నా... కాస్త అటు ఇటుగా ఇవి స్వీట్ వార్నింగ్సే అని అంటున్నారు పరిశీలకులు.

ఇప్పటికే కచ్చితంగా రెండున్నరేళ్లు పవర్ షేరింగ్ ఉండాలని... వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని.. బలంగా చెబుతున్న జోగయ్య పేరున మరోలేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తుంది. ఈ లేఖలో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 11 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించాలని.. అలా కానిపక్షంలో జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సిన వచ్చే మాట నిజమే అని ఆయన నొక్కి చెబుతున్నారు.

అవును... తాజాగా విడుదలైన లేఖలో... ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని చెప్పిన జోగయ్య... రాష్ట్రం మొత్తం ఓట్ల ట్రాన్స్ ఫర్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆలోచించాలనే సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లు జనసేనకు కేటాయించాలని కోరుతూ.. ఆయా నియోజకవర్గాల పేర్లు ప్రస్థావించారు.

ఈ క్రమంలో జనసైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జనసేనకు కేటాయించడం తప్ప టీడీపీ - జనసేన కూటమికి మరో మార్గం లేదని.. అలా కానిపక్షంలో వచ్చే నష్టాన్ని టీడీపీ పార్టీ అనుభవించాల్సిన మాట నిజమే అని జోగయ్య చెబుతున్నారు. ఈ స్థాయిలో చంద్రబాబుని వార్న్ చేస్తున్నట్లుగా మాట్లాడటం.. ఆ హెచ్చరికలను.. సూచనలుగా అప్పుడప్పుడూ చురకలంటిస్తూ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది!

ఈ సందర్భంగా... నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వురు, ఉండి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలని హరిరామ జోగయ్య తన లేఖలో టీడీపీ - జనసేన కూటమికి సూచించారు. దీంతో... పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలను జనసేనకే కేటాయించాలనే వాదనకు ఇది మరింత బలం చేకూరుస్తుందని అంటున్నారు.

అలా కాకుండా.. వచ్చిన కాడికే రాసి ఉన్నట్లు అని జనసేన నేతలు భావిస్తే జోగయ్య చెబుతున్నట్లు కాపు ఓట్లు టీడీపీ - జనసేన కూటమికి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు ఉండవని.. ఉన్నప్పటికీ అవి అతి స్వల్పానికే పరిమితమవుతాయని చెబుతున్నారు పరిశీలకులు. మరి టీడీపీ - జనసేన పెద్దలు ఈ సూచనలు కం హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటారా.. 50 - 60 సీట్లు జనసేనకు కేటాయిస్తారా.. రెండున్నర సంవత్సరాలు సీఎం సీటు షేరింగ్ హామీ ఇస్తారా.. లేక.. కాపు ఓటర్లను, ఆ సామాజికవర్గ శ్రేయోభిలాషులను, జోగయ్య లేఖలను లైట్ తీసుకుని ముందుకు కదులుతారా అనేది వేచి చూడాలి!