Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ న్యూస్ : మాజీ మంత్రి అంబటికి బెయిలు.. అయినా విడుదలలో ట్విస్టు!!

తాజాగా పట్టాభిపురం స్టేషన్ లో నమోదైన కేసులోనూ అంబటికి బెయిలు ఇస్తూ గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

By:  Tupaki Political Desk   |   11 Feb 2026 3:39 PM IST
బ్రేకింగ్ న్యూస్ : మాజీ మంత్రి అంబటికి బెయిలు.. అయినా విడుదలలో ట్విస్టు!!
X

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిలు లభించింది. గత ఏడాది నవంబరు 12న పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గత నెల 31న మాజీ మంత్రి అంబటిని గుంటూరులోని నల్లపాడు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అంబటికి రెండు రోజుల క్రితమే బెయిలు లభించింది. అయితే పట్టాభిపురం పోలీసుస్టేషన్ లో నమోదైన కేసులో రిమాండ్ కారణంగా ఆయన ఇప్పటివరకు రాజమండ్రి జైలులోనే ఉండిపోవాల్సివచ్చింది.

తాజాగా పట్టాభిపురం స్టేషన్ లో నమోదైన కేసులోనూ అంబటికి బెయిలు ఇస్తూ గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో మాజీ మంత్రి అంబటి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత ఏడాది నవంబరు 12న వైసీపీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి అంబటి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సమయంలో పట్టాభిపురం సీఐతో అంబటికి వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు విధి నిర్వహణకు అవాంతరం కలిగించారని మాజీ మంత్రి అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాదాపు మూడు నెలల క్రితం కేసు నమోదు చేసినా పోలీసులు ఇంతవరకు అరెస్టుకు ప్రయత్నించలేదు. కానీ, గత నెల 31న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కేసులో బెయిలు మంజూరైనా పీటీ వారెంటు ద్వారా పట్టాభిపురం కేసులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ రెండు రోజుల క్రితం న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇదేసమయంలో అంబటిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు, బెయిలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.

బుధవారం ఈ రెండు పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయమూర్తి నిందితుడికి బెయిలు ఇస్తున్నట్లు తీర్పునిచ్చారు. దీంతో మాజీ మంత్రి అంబటి విడుదలకు మార్గం సుగమం అయింది. కోర్టు ప్రోసీజర్స్ పూర్తయిన తర్వాత అంబటి గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మొత్తం 52 కేసులు పెండింగులో ఉన్నాయి. ఇందులో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయమై 36 కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అయితే గుంటూరు పోలీసులు ఈ విషయంపై ఇప్పటికే ఆయనను అరెస్టు చేశారు. మిగిలిన కేసుల్లో 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అంబటిని మరే కేసులోనూ పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు.