బీజేపీలోకి వైసీపీ ఎంపీ... క్లారిటీ వచ్చేసింది!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 Jun 2024 3:36 PM ISTఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మండలిలో బలంగా ఉన్న ఎమ్మెల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి సవాలుగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు లొంగొద్దు, కేసులకు బెదరొద్దు అంటూ జగన్ ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.
అవును... సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాస్త తేరుకున్న జగన్... గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీలతో వరుసగా భేటీలు ఏర్పాటుచేసి వారికి భరోసా కల్పించే పనికి పూనుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దంటూ ఆయన తమ పార్టీ నేతలకు సూచించారు. అయినప్పటికీ వైసీపీ ఎంపీలకు బీజేపీ గాళం వేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు మండలిలో బలంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలను టీడీపీ లాక్కునే అవకాశం ఉందనే చర్చా తెరపైకి వచ్చింది. గతంలో వైసీపీ తరుపున అరకు నుంచి గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత.. అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె పార్టీ ఫిరాయించడంతో... తాజాగా గెలిచిన వైసీపీ ఎంపీ తనూజారాణి విషయంలోనూ అదే జరగబోతోందంటూ ప్రచారం ఊపందుకుంది.
వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే తొలి ఎంపీ ఆమే అంటూ గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ తనూజారాణీ స్పందించారు. ఈ ప్రచారాలపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎక్స్ లో స్పందించారు. ఈ క్రమంలోనే ఈ ప్రచారానికి ఒక్కమాటలో సమాధానం చేప్పేశారు.
ఇందులో భాగంగా... "ప్రాణం ఉన్నంతవరకూ జగనన్నతోనే మా ప్రయాణం" అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో... ఆమె పార్టీ మారబోవడం లేదని.. వైసీపీలోనే కొనసాగుతానని చెప్పకనే చెప్పినట్లయ్యిందని అంటున్నారు.
కాగా... ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన అరకు లోక్ సభ స్థానం నుంచి తొలిసారి వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న తనూజారాణి... బీజేపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
