Begin typing your search above and press return to search.

గుడివాడ వెటకారం పీక్స్... లోకేష్ కు ఉప్పు కలిపిన పప్పు గిఫ్ట్!

విశాఖ జిల్లాలో జరిగిన "శంఖారావం" సభలో మైకందుకున్న లోకేష్... అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Feb 2024 12:40 PM GMT
గుడివాడ వెటకారం పీక్స్... లోకేష్ కు ఉప్పు కలిపిన పప్పు గిఫ్ట్!
X

విశాఖ జిల్లాలో జరిగిన "శంఖారావం" సభలో మైకందుకున్న లోకేష్... అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అమర్నాథ్ కు చిన్న వయసులోనే పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం వస్తే.. ఒక్క పరిశ్రమా తీసుకురాలేదని.. ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పించలేదని.. ప్రశ్నించిన వారికి కోడిగుడ్డు కథలు చెబుతున్నారని విమర్శిస్తూ... అందుకే మంత్రి కోసం కోడిగుడ్డును బహుమతిగా తెచ్చాను అంటూ గిఫ్ట్‌ బాక్స్‌ లో తెచ్చిన కోడిగుడ్డును లోకేష్ ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అమర్నాథ్ భూ సమీకరణ పేరుతో 600 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. దీంతో ఈ ఆరోపణలపై ఈ రోజు స్పందించిన అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ... వాటికి కాస్త వెటకారాన్ని దట్టించారు. ఈ సందర్భంగా... తనపైనా, వైసీపీ నేతలపైనా, పార్టీపైనా, జగన్ మోహన్ రెడ్డి పైనా.. లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేశారని మొదలుపెట్టిన అమర్నాథ్... తనకోసం తెచ్చిన కోడిగుడ్డు బహుమతిపై స్పందించారు.

ఇందులో భాగంగా రిటన్ గిఫ్ట్ ఇవ్వడం మన సంప్రదాయం, ధర్మం అని చెప్పుకొచ్చిన అమర్నాథ్... ఒక మట్టికుండలో నిండా పప్పు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ ఎంతగానో ఇష్టపడే పప్పుకు... కాస్త ఉప్పు, కారం కలిపి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఎవరైనా సాహసించి లోకేష్ కు ఈ బహుమతి అందివ్వాలని కోరారు. ఒక వేళ తనకు బాగా ఇష్టమైన ఐటం అవ్వడం వల్ల లోకేషే స్వయంగా వచ్చి తీసుకెళ్లినా ఇబ్బంది లేదని తెలిపారు.

అయితే ఈ కుండలో కేవలం ముద్దపప్పు మాత్రమే కాకుండా... అందులో కాస్త ఉప్పు, కారం కూడా కలిపినట్లు చెప్పిన అమర్నాథ్... ఇది తినడం వల్ల కాస్తైనా సిగ్గూ, లజ్జా, విశ్వాసం పెరుగుతాయనే ఉద్దేశ్యంతో చేయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో తాను వందల కోట్లు, వందల ఎకరాల అవినీతికి పాల్పడినట్లు లోకేష్ తనపై చేసిన విమర్శలకు అమర్నాథ్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా లోకేష్ లాగా తాను బ్యాక్ డోర్ పొలిటిషీయన్ కాదని.. తన తండ్రి మరణానంతరం సుమారు 18ఏళ్లు పోరాటం చేసి, ఈ ప్రాంత ప్రజల మన్నలను పొంది, వైఎస్ జగన్ దయవల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి స్థానంలో కూర్చున్నట్లు తెలిపారు. కానీ లోకేష్ మాత్రం ముందుగా మంత్రి అయ్యి, తర్వాత ఎమ్మెల్సీ అయ్యి, అనంతరం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారని.. ఇది ఆయన మార్కు పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో... ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దమా అని ప్రశ్నించిన అమర్నాథ్... అయ్యన్న గంజాయి డాన్ అని గంటా శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారని.. ఇదే సమయంలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలని.. అదేవిధంగా... గతంలో రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.

ఇక ప్రతీ సభలోనూ కుర్చీలు మడతపెడుతున్న అంశంపై స్పందించిన అమర్నాథ్... చంద్రబాబు, లోకేష్ ల కుర్చీలు ఎప్పుడో మడత పెట్టేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో రెడ్ బుక్‌ లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్‌ కు రాదని.. ఆ రెడ్ బుక్‌ ను కూడా మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటారో ఆయన ఇష్టమని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు.