విచిత్ర ఘటన..చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు
గ్రీస్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఘటన వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. చాట్ జీపీటీ మాటలు నమ్మి ఒక భార్య ఏకంగా తన భర్తకు విడాకుల నోటీసులు పంపించింది.
By: Tupaki Desk | 11 May 2025 5:30 PMగ్రీస్‌లో జరిగిన ఈ విచిత్రమైన ఘటన వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. చాట్ జీపీటీ మాటలు నమ్మి ఒక భార్య ఏకంగా తన భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. అసలు ఏం జరిగిందో తెలుసా? టెక్నాలజీ మన జీవితాలపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ ఉదంతం కళ్లకు కడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రీస్‌కు చెందిన ఒక మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి చాట్ జీపీటీ చెప్పిన మాటలను నమ్మడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఆ దంపతులు కలిసి టీ తాగిన తర్వాత, ఆ ఖాళీ కప్పుల ఫోటోలను తీసి ఆమె చాట్ జీపీటీలో అప్లోడ్ చేసింది. వాటి ఆధారంగా తమ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పమని అడింది. ఊహించని విధంగా, చాట్ జీపీటీ ఆమె భర్తకు వేరే యువతితో సంబంధం ఉందని ఆన్సర్ ఇచ్చింది.
ఆ కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) ఇచ్చిన సమాధానాన్ని నిజమని నమ్మిన ఆ మహిళ, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. దీంతో షాక్‌కు గురైన ఆ భర్త "ఏఐ నా కొంప ముంచింది బాబోయ్" అంటూ లబోదిబోమంటున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, కేవలం ఒక ఏఐ చెప్పిన మాటలను నమ్మి తన భార్య విడాకులు ఇవ్వడం అతనికి తీవ్రమైన బాధను మిగిల్చింది.
ఈ ఘటన ఏఐ ప్రభావాన్ని మరోసారి రుజువు చేస్తోంది. సరైన విచక్షణ లేకుండా, కేవలం టెక్నాలజీపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఒకవైపు ఏఐ మన జీవితాలను సులభతరం చేస్తుంటే, మరోవైపు ఇలాంటి సంఘటనలు దానిపై పూర్తిగా ఆధారపడడం ఎంతవరకు సమంజసమో ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ మహిళ అవివేకానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు టెక్నాలజీని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ఉదంతం మాత్రం టెక్నాలజీ వినియోగంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.