Begin typing your search above and press return to search.

గ్రేటర్ రాయలసీమ తప్పదు...మైసూరా సంచలనం

ఏపీలో ఇపుడిపుడే రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణా విడిపోయాక 2014 నుంచి 12 ఏళ్ళుగా ఏపీ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది.

By:  Satya P   |   6 April 2026 1:30 AM IST
గ్రేటర్ రాయలసీమ తప్పదు...మైసూరా సంచలనం
X

ఏపీలో ఇపుడిపుడే రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణా విడిపోయాక 2014 నుంచి 12 ఏళ్ళుగా ఏపీ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇక రాజధాని వ్యవహారం చూస్తే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ వేటికీ లేని శతకోటి వివాదాలు ఏపీకి దాపురించాయని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. ఇక ఏపీకి అమరావతి రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసింది. దాంతో ఏపీకి ఇక రాజధాని హంగు వచ్చిందని అంతా హ్యాపీగా తరతరాలూ ముందుకు సాగవచ్చు అని అనుకుంటున్న వేళ సీనియర్ రాజకీయ నేత మాజీ హోం మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఒక బాంబు పేల్చారు. ఏపీలో రాజధాని పరిణామాలు రాజకీయాలు చూస్తూంటే గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం తప్పదనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమకు అన్యాయం :

ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణన్ కమిషన్ అయితే అమరావతి ప్రాంతాన్ని కానీ విజయవాడ గుంటూరుని కానీ రాజధానిగా ఎంపిక చేయవద్దని కీలక సూచనలు చేసింది అని గుర్తు చేశారు. దొనకొండ వద్ద ఏకంగా డెబ్బై వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కూడా కమిషన్ చెప్పిందని అన్నారు. అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం వ్యవసాయిక భూములను తీసుకోవద్దని ప్రైవేట్ భూములు అంతకంటే తీసుకోవద్దని చెప్పింది అన్నారు. ప్రజల మీద పెద్దగా భారం లేకుండా ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్న చోట రాజధాని నిర్మించుకోవాలని కీలక సూచనలు చేసిందని గుర్తు చేశారు.

పట్టుబట్టి మరీ :

అయితే ముఖ్యమంత్రిగా విభజన ఏపీకి తొలిసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పట్టుబట్టి మరీ వ్యవసాయ ప్రాంతం మునక ప్రాంతం అయిన అమరావతిని ఎంపిక చేశారని మైసూరారెడ్డి విమర్శించారు. దాని వల్ల రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ప్రజల మీద పెను భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగన్ అయితే మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనలు చేయడం మరింత బాధాకరం అన్నారు. శివరామ కృష్ణన్ కమిషన్ వద్దు అన్న చోట్లనే ఈ ఇద్దరు నాయకులు రాజధాని అంటున్నారని ఆయన నిందించారు. ఈ ఇద్దరినీ రాయలసీమ పెంచి పోషించిందని రాజకీయంగా కీలక స్థానం ఇచ్చిందని అయినా సరే వీరు ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిలుపు ఇస్తున్నా అంటూ :

తాను ఈపాటికే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందని అయితే వయసు కారణంగా ఆగిపోతున్నాను అన్నారు. కానీ రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పట్ల యువత స్పందించాలని వారు గ్రేటర్ రాయలసీమ నినాదంతో ఉద్యమించాలని మైసూరారెడ్డి పిలుపు ఇవ్వడం విశేషం. నీలం సంజీవ రెడ్డి కర్నూల్ కి రాజధానిని తెచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఎంతో కొంత రాయలసీమను అభివృద్ధి చేశారు అని మైసూరారెడ్డి చెప్పుకొచ్చారు.

జగన్ ది గందరగోళం :

వైసీపీ అధినేత జగన్ కి రాజధాని విషయంలో స్పష్టమైన ఆలోచనలు ఏమీ లేవని మైసూరా తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు అమరావతి రాజధానిని టీడీపీ ప్రభుత్వం అనుకున్నపుడు వ్యతిరేకించమని రాయలసీమ ఉద్యమ నేతలుగా కోరామని ఆయన గుర్తు చేశారు. అయితే జగన్ మాత్రం ఆనాడు ఓకే అని అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ఆ తరువాత ఆయన వ్యతిరేకించి మూడు రాజధానులు ముందుకు తెచ్చారని అన్నారు ఇపుడు మావిగాన్ అంటున్నారని ఆయనకు స్థిరమైన అభిప్రాయం లేదని మైసూరా అన్నారు. మావిగాన్ అన్నది అర్ధం పర్ధం లేని వ్యవహారం అని కొట్టిపారేశారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కి రావడం అన్నది మౌలిక సదుపాయాల కోసమే జరిగింది అని అన్నారు. ఇపుడు అయినా రాయలసీమకు న్యాయం జరగాలని ఆయన కోరారు.