Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్.. అజ్జూ భాయ్‌కి అండగా సీఎం రేవంత్

తెలంగాణ మంత్రి అజరుద్దీన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ ఈ నెల 30 లోగా ఏదైనా చట్టసభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సివుంది.

By:  Tupaki Desk   |   19 April 2026 6:00 PM IST
మేటర్ సీరియస్.. అజ్జూ భాయ్‌కి అండగా సీఎం రేవంత్
X

తెలంగాణ మంత్రి అజరుద్దీన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ ఈ నెల 30 లోగా ఏదైనా చట్టసభలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సివుంది. అలాకాని పక్షంలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సివుంటుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. మంత్రి అజారుద్దీన్ తోపాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన ఫైల్ ను ఆమోదించాలని కోరారు. ప్రధానంగా మంత్రి అజారుద్దీన్ ను నామినేట్ చేసే అంశంపైనే సీఎం దృష్టిపెట్టారని చెబుతున్నారు.

సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ లు యథాతథంగా ఆమోదిస్తారు. కానీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితుల కారణంగా ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం పెండింగ్ లో పడిపోయినట్లు చెబుతున్నారు. మంత్రి అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గత ఏడాది అక్టోబరు 28న తెలంగాణ మంత్రి మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఆమోదించాల్సిందిగా గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఇక ఆ నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు.

ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంతో అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు. అజారుద్దీన్ మంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ ఉండగా, తర్వాత ఆయన బదిలీ అయ్యారు. కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా వచ్చారు. ఈ కారణంగా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం నియామకం పెండింగులో ఉండిపోయినట్లు చెబుతున్నారు.

అయితే ప్రొఫెసర్ కోదండరాంకు సంబంధించి న్యాయవివాదం ఉండటంతోనే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో అజారుద్దీన్ పేరును సైతం ఆమోదిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. మరో పది రోజుల్లో గవర్నర్ ఆమోదం లభించకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సివుంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే గవర్నర్ నిర్ణయమేంటో మాత్రం తెలియలేదు. దీంతో అజ్జూభాయ్ మంత్రి పదవిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.