Begin typing your search above and press return to search.

అనంతకు దూరం.. అధినేతకు దగ్గర, విజయవాడ వేదికగా మాజీ ఎంపీ నయా స్ట్రాటజీ

మాజీ పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Feb 2026 1:00 AM IST
అనంతకు దూరం.. అధినేతకు దగ్గర, విజయవాడ వేదికగా మాజీ ఎంపీ నయా స్ట్రాటజీ
X

మాజీ పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికలలో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకుని టీడీపీ కంచుకోటైన హిందూపురంలో సత్తా చాటిన గోరంట్ల మాధవ్ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే మళ్లీ రాజకీయంగా ప్రభావం చూపాలనే ఆలోచనతో ఆయన ఇటీవల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు మాజీ ఎంపీ మాధవ్ చేస్తున్న ప్రయత్నాలపై పెద్ద చర్చే జరుగుతోంది.

హిందూపురం ఎంపీగా గెలిచిన తర్వాత వివాదాస్పద వైఖరితో గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కించుకోలేకపోయారని చెబుతున్నారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, ఎన్నికల సమయంలో పార్టీ కోసం మాజీ ఎంపీ మాధవ్ చిత్తశుద్ధితో పనిచేసినట్లు పార్టీ అధిష్టానం గుర్తించిందని చెబుతున్నారు. పోలీసు అధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్.. ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. అయితే పదవి పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైన పార్టీ పట్ల విధేయత ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

ఇలా ఆయన నడుచుకోడానికి కారణం వచ్చే ఎన్నికల్లో ఎక్కడో ఒక చోట అవకాశం దక్కకపోతుందా? అన్న ఆలోచనే అంటున్నారు. అయితే ఆయన సొంత జిల్లా కర్నూలు, రాజకీయంగా ఎదిగిన అనంతపురం, సత్యసాయి జిల్లాలు కాకుండా, ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా చేస్తున్న కొత్త రాజకీయమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఎంపీగా ఉండగా మాధవ్ పూర్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లాకే పరిమితమై పనిచేసేవారు. అయితే ఇప్పుడు తన మకాంను విజయవాడకు మార్చేశారు.

తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో తరచూ కనిపిస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తన వాణి వినిపిస్తున్నారు మాధవ్. ఈ విధంగా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ చేబ్రోలుపై దాడి చేసి హడావిడి చేయడమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పై విమర్శలు చేస్తూ వాగ్దాటి ప్రదర్శిస్తున్నారు మాధవ్. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ భద్రతపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆకర్షించాయని అంటున్నారు. ఈ విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ పొలిటికల్ కెరీర్‌ను రీబూట్ చేసుకోడానికే అంటున్నారు.

2029 ఎన్నికల నాటికి రాయలసీమలో ఏదో ఒక పార్లమెంటు లేదా అసెంబ్లీ స్థానాన్ని గట్టి పరచుకోవాలనే ఆలోచనతోనే మాజీ ఎంపీ మాధవ్ తాడేపల్లిలో మకాం వేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మాధవ్ కు సొంత నియోజకవర్గం అంటూ లేకపోయిందని అంటున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన హిందూపురం లోక్ సభ స్థానంపై ఆయన మళ్లీ ఆశ పెట్టుకున్నారని అంటున్నారు. అదే సమయంలో సొంత జిల్లా కర్నూలు లేదా నివాసం ఉంటున్న అనంతపురంల్లో ఏదో ఒక స్థానానికి సమన్వయకర్తగా నియమిస్తారని ఎదురుచూస్తున్నారని అంటున్నారు. అలా కుదరని పక్షంలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తారని ఆశలు పెట్టుకుంటున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో మాజీ ఎంపీ మాధవ్ కు పార్టీలో ఉన్న ఇతర నేతలకు మధ్య ఉన్న విభేదాలు కూడా ఆయన మకాం విజయవాడకు మార్చడానికి కారణంగా చెబుతున్నారు. జిల్లా నేతలతో విభేదాల వల్ల భారం అధిష్టానంపై వేసి సాఫీగా రాజకీయ ప్రయాణం సాగిపోయేలా చూసుకుంటున్నారని కూడా చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో కీలక నేత అనంత వెంకట్రామిరెడ్డితో మాజీ ఎంపీ మాధవ్‌కు ఇప్పటికీ పొసగడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగా జిల్లాలో స్పేస్ దొరకని పరిస్థితుల్లో, తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయి నేతగా ఎదగాలని ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.