Begin typing your search above and press return to search.

అడ్డంగా బుక్కైన మాధవ్.. పాత కేసులన్నీ తెరపైకి తెస్తున్న సర్కారు?

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   11 April 2025 11:33 AM IST
Gorantla Madhav Arrest Sparks Controversy
X

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి యత్నించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై నాన్ బెయిలుబుల్ కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. గురువారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలోనే ఐటీడీపీ కార్యకర్తపై దాడికి ప్రయత్నించిన మాజీ ఎంపీని ఆ వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాత్రంతా నల్లపాడు పోలీసుస్టేషన్ లోనే ఉంచారు. ఈ రోజు మాజీ ఎంపీని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

పోలీసు అధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ గత ఐదేళ్లు దూకుడా వ్యవహరించారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచార బాధితుల పేర్లు బయటపెట్టిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఆయనను అరెస్టు చేస్తారని వైసీపీ భయపడింది. కానీ, పోలీసులు ఆయనను విచారించి వదిలేశారు. ఇక ఆయన ఎంపీగా ఉండగా, వైరల్ అయిన వీడియో వెనుక కొందరు మీడియా అధిపతులు ఉన్నారని, వారిని కులంపేరుతో దుర్భాషలాడిన కేసు కూడా పెండింగులో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై దాడికి కొద్దిసేపటి ముందు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎంపీ మాధవ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై నోరు పారేసుకున్నారు. అడవాళ్లకు అక్కా కాదు.. మగవాళ్లకు బావ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్త తాడేపల్లి పోలీసుస్టేషన్ లో మాధవ్ పై ఫిర్యాదు చేశారు. దీనిపైనా మరో కేసు నమోదైంది. తాజా కేసు తప్పితే మిగిలిన కేసులను ప్రభుత్వం పెద్దగా సీరియసుగా తీసుకోలేదని టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. కానీ, మాజీ ఎంపీ మాధవ్ తన దుందుడుకు ప్రవర్తనతో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం దాడి కేసులో అరెస్టు అయిన మాజీ ఎంపీపై ఇంకే కేసులు నమోదు చేస్తారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంశీ, సినీ నటుడు పోసాని వంటివారిలా మాధవ్ పైనా కేసులు నమోదు చేస్తారా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.