Begin typing your search above and press return to search.

పసిడి, వెండికి పట్టు తప్పిందా? ఒక్కరోజులోనే భారీగా దిగొచ్చిన ధరలు!

గత కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు హఠాత్తుగా బ్రేక్ పడింది.

By:  Tupaki Desk   |   5 April 2025 11:30 AM IST
Gold & Silver Prices Crash Sharply After Long Rally
X

గత కొన్నాళ్లుగా పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు హఠాత్తుగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం ఒక్కరోజే ఔన్సు మేలిమి బంగారం 80 డాలర్లకు పైగా పతనమవగా, వెండి ధర కూడా కిలోకు అదే స్థాయిలో క్షీణించింది. ఈ ప్రభావంతో దేశీయంగానూ పసిడి, వెండి ధరలు గణనీయంగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.2,400 తగ్గి రూ.91,000 వద్ద ట్రేడ్ అయింది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.8,000 పైగా పతనమై రూ.89,800కు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో (ఏప్రిల్ 1న) రూ.94,000 దాటిన 10 గ్రాముల బంగారం ఇప్పుడు రూ.3,000 మేర తగ్గింది. వెండి విషయానికొస్తే, కేవలం రెండు రోజుల్లోనే కిలోకు రూ.1.02 లక్షల నుంచి రూ.12,000 కంటే ఎక్కువ తగ్గడం గమనార్హం.

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పుడు, సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారం వైపు మదుపర్లు మొగ్గుచూపుతారు. అయితే, గత ఏడాదిలో 35%, ఈ ఏడాదిలోనే దాదాపు 20% మేర పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా దిద్దుబాటుకు గురయ్యాయి. దీనికి ప్రధాన కారణం మదుపర్లు లాభాలు స్వీకరించడమేనని నిపుణులు భావిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలు దాదాపు 70% తగ్గాయని, పాత ఆభరణాలు ఇచ్చి కొత్తవి తీసుకునే ట్రెండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్‌లు విధిస్తుండటంతో, బంగారం గరిష్ట ధరలు నిలబడవనే అంచనాలతో మదుపర్లు అమ్మకాలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు సఫలమైతే, బంగారం ధర మరింత దిగివచ్చే అవకాశం ఉందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన వారు మినహా, మిగిలిన వారు అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ సరైన సమయం చూసి బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కాస్త బలపడటం కూడా మనకు కలిసివచ్చే అంశమే.