వైరల్ వీడియో.. వివాహ వేడుకలో మోడ్రన్ టచ్ నెటిజన్ల కామెంట్లు..
వివాహం అనేది పవిత్రమైన బంధం, వివాహ తంతు సంప్రదాయబద్ధమైన వేడుక.
By: Tupaki Desk | 24 April 2026 4:27 PM ISTవివాహం అనేది పవిత్రమైన బంధం, వివాహ తంతు సంప్రదాయబద్ధమైన వేడుక. కానీ నేటి కాలంలో పెళ్లిళ్లు ఒక ఆత్మీయ వేడుకలా కాకుండా, ఆర్భాటాలకు, ప్రదర్శనలకు వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘గ్లామరస్’ సర్వింగ్ వీడియో చూస్తుంటే, అతిథి మర్యాదల పేరుతో మనం ఏ దిశగా వెళ్తున్నామో అర్థం కావడం లేదు.
మన సంస్కృతిలో ‘అతిథి దేవోభవ’ అంటాం. పెళ్లికి వచ్చిన వారికి మర్యాద చేయడం అనేది ఒక గౌరవప్రదమైన ప్రక్రియ. అయితే, ఇటీవల ఒక వివాహ వేడుకలో గ్లామరస్ యువతులను ఆహ్వానించి, వారి ద్వారా అతిథులకు సర్వ్ చేయించడం చర్చనీయాంశమైంది. కేవలం పాశ్చాత్య దేశాల్లోని క్లబ్ సంస్కృతిని తలపించేలా ఉన్న ఈ 'హైటెక్' మర్యాదలు నెటిజన్ల భిన్న అభిప్రాయాలకు కారణం అవుతున్నాయి. ఒక పక్క సంప్రదాయ వేడుకలో ఇలాంటి గ్లామర్ ప్రదర్శనలు అవసరమా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
మితిమీరితే అసలుకే మోసం!
ప్రస్తుత పెళ్లిళ్లలో వెడ్డింగ్ ప్లానర్స్ కొత్త కొత్త ఐడియాల కోసం వెతుకుతున్నారు. దీనివల్ల వేడుకలు వింతగా మారుతున్నాయి. అది ఎంత వరకు సమంజసం అనేది ఆలోచించడం లేదు. వీడియోలో యువతులు వివాహ వేడుకకు తగినట్లుగా లేవని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వారు సంప్రదాయ చీరకట్టులో మర్యాదలు చేసి ఉంటే, అది ఒక క్లాసిక్ లుక్‌ని ఇచ్చేది.
హైటెక్ మర్యాదలతో విమర్శలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘పెళ్లి అంటే కుటుంబ సభ్యుల కలయిక. అక్కడ వేడుకలో సంస్కృతిని పాటిస్తే మరింత కన్నుల పండువగా ఉండేది. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి చేసే పెళ్లిళ్లలో కేవలం తాము ‘డిఫరెంట్’ అనిపించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిలో భోజనం రుచిగా ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు ఎంట్రీ డ్యాన్సులు, హెలీకాప్టర్ షాట్లు, గ్లామరస్ సర్వర్లు ఉంటేనే అది గ్రాండ్ వెడ్డింగ్ అనిపించుకుంటున్నారు.
నేటి కాలంలో వివాహ వేడుకలు వాటి అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయి ఆర్భాటాలకు వేదికగా మారుతున్నాయి. సంప్రదాయ వివాహాల్లో అందరూ గౌరవప్రదమైన చీరలు, దోవతీలు ధరించి పద్ధతిగా కనిపిస్తే, నేటి హైటెక్ పెళ్లిళ్లలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. గతంలో అతిథి మర్యాదలను కుటుంబ సభ్యులు లేదా వంటావారు ఎంతో ఆత్మీయంగా చేసేవారు, ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ద్వారా ప్రదర్శన లా మర్యాదలు చేయిస్తున్నారు. సంప్రదాయ పెళ్లిళ్లలో ఆశీర్వాదం, ఆత్మీయత ప్రధాన లక్ష్యంగా ఉంటే, నేటి తరం పెళ్లిళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం చేసే ఒక షో లాగా కనిపిస్తున్నాయి. దీనివల్ల అవసరానికి అనుగుణంగా జరగాల్సిన ఖర్చు కాస్తా, కేవలం వృథా ఆర్భాటం కోసం భారీగా పెరిగిపోతోంది.
పెళ్లి అనేది వ్యక్తి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకం మనం పాటించే పద్ధతుల ద్వారా పదికాలాల పాటు గుర్తుండిపోవాలి. కేవలం ఒక రోజు వైరల్ అవ్వడం కోసం సంప్రదాయాలను తుంగలో తొక్కడం సరైనది కాదు. మంచి చీరలు, పద్ధతి గల వేషధారణతో మర్యాదలు చేస్తే అది ఎప్పటికీ గౌరవప్రదంగా ఉంటుంది. హంగులు, ఆర్భాటాల కంటే సంస్కృతిని కాపాడుకోవడమే మనందరి బాధ్యత.
