Begin typing your search above and press return to search.

ఫన్ ఫోటో టాక్... ఒక్కసారి ఫేసు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి!

సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు రామమందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగింది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 11:39 AM GMT
ఫన్  ఫోటో టాక్... ఒక్కసారి ఫేసు  లెఫ్ట్  టర్నింగ్  ఇచ్చుకోండి!
X

ఉత్తరప్రదేశ్‌ లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు రామమందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యి ప్రత్యక్షంతా తిలకించగా.. కోట్ల మంది భక్తులు పరోక్షంగా వీక్షించారు!

ఈ క్రమంలో రాజకీయ, సినీ, క్రీడా, న్యాయ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండుల్కర్, అనీల్ కూంబ్లే, రాం దేవ్ బాబా, శంక ర్ మహదేవన్ మొదలైన వారు హాజరయ్యారు.

వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైనవారిలో... సతీసమేతంగా చిరంజీవి, రాం చరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ప్రముఖంగా ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చిరంజీవి... అయోధ్య రామాలయానికి రావడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పగా... ఇది దేశంలోని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవమని, నేడు అయోధ్యకు రావడం తన అదృష్టమని హీరో రాం చరణ్ తెలిపారు.

ఇదే సమయంలో స్పందించిన పవన్ కల్యాణ్... ఈరోజు తానెంతో భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా... ప్రాణ పతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్లు వచ్చేశాయని అన్నారు. ఇక, ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ వేడుక సందర్భంగా చిరంజీవి, చంద్రబాబులకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చిరంజీవి, చంద్రబాబులు పక్కపక్కనే ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారగా... ఆ ఫోటో కి నెటిజన్లు స్పందిస్తున్న విధానం మరింత ఆసక్తిగా మారింది. తమ తమ క్రియేటివిటీలకు పని చెబుతూ... ఈ ఫోటోకి తమ కామెంట్లతో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు నెటీజన్లు. ఇది లిప్ రీడింగ్ కాదు.. అంతకు మించి అని చెబుతున్నారు.

తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలో... గడ్డం కింద చేయి పెట్టుకున్న చిరంజీవి.. చంద్రబాబు వైపు చూస్తుండగా... ఆ సమయంలో చంద్రబాబు సీరియస్ లుక్ లో వేదికవైపు చూస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంది. ఈ సమయంలో చిరంజీవి వెనుక ఆయన సతీమణి సురేఖ ఉన్నారు. దీంతో.. ఈ ఫోటోకి నెటిజన్లు పెడుతున్న కామెంట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

"మాస్టారూ... అంత సీరియస్ ఎందుకు? ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి" అని ఒకరంటే... "బాబు... ఇంతకీ మా తమ్ముడికి ఎన్ని సీట్లు ఇస్తున్నావ్?" అని మరొకరు కామెంట్ చేశారు! ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు & కో ఎదురుచూస్తున్నారనే కథనాలొస్తున్న వేళ... "మనిషి నా పక్కనే ఉన్నాడు కానీ... చూపంతా మోడీ వైపే ఉంది" అని చిరంజీవి మనసులో అనుకుంటున్నట్లు ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇదే క్రమంలో... "మా తమ్ముడిని పాల ముంచుతావా.. నీట ముంచుతావా బాబూ?" అని చిరంజీవి తనలో తాను, చంద్రబాబుని ప్రశ్నిస్తున్నట్లు ఇంకొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా... ఎవరి క్రియేటివిటీకి వారు పని చెబుతూ ఈ ఫోటోపై నెట్టింట ఆసక్తికరంగా స్పందిస్తున్నారు!